- అధిక వర్షపాతం వరి, పత్తి రైతులు జాగ్రత్త వహించాలి.
- పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి బండి ప్రమోద్ కుమార్.
పాలకుర్తి 30 జులై పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి
మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరి, పత్తి పంటల్లో రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని పాలకుర్తి మండల వ్యవసాయ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలో ప్రస్తుతం 2,782 ఎకరాల్లో పత్తి, 9,678 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణానికి గాను 6,100 ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయని, మరో 3,578 ఎకరాల్లో వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఎల్-నినో ప్రభావం ఇంకా పూర్తిగా తొలగలేదని, రేపటి నుంచి మళ్లీ బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉనందున రైతులు తొందరపడి వరి నాట్లు వేయవద్దని, ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.వర్షాల వల్ల పంట చేన్లలో నీరు నిలబడితే భారీ నష్టం జరుగుతుందని ఏఓ హెచ్చరించారు.వరి పొలంలో 3 నుండి 4 అంగుళాల కంటే ఎక్కువ నీరు ఉంటే వెంటనే బయటకు పంపాలి,వర్షం ఆగిన 2-3 రోజుల తర్వాత ఎకరాకు 5 నుండి 10 కిలోల యూరియా, 5 కిలోల పొటాష్ వేసుకోవాలి. పొటాష్ వేయడం వల్ల కాండం గట్టిపడి పంట పడిపోకుండా ఉంటుంది.బ్లాస్ట్, బ్యాక్టీరియా ఆకు కుళ్ళు తెగుళ్ల నివారణకు లీటరు నీటికి ‘ట్రైసైక్లోజోల్’ 0.6 గ్రాములు లేదా ‘కాపర్ ఆక్సిక్లోరైడ్’ 3 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.రైతులందరూ ఈ సూచనలు తప్పనిసరిగా పాటించి పంటలను కాపాడుకోవాలని, సలహాలు సందేహాల కోసం స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారిని ఏఈఓ సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారి తెలిపారు






