రుచికపై కేసు.. ఢిల్లీకి బదిలీ.
• ప్రధానిపై వ్యాఖ్యలు.. నోయిడా యువతిపై చర్యలు.
ఢిల్లీ, మహా.
జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై నోయిడాకు చెందిన యువతి రుచికా సింగ్ (25)పై పోలీసులు కేసు నమోదు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది స్మృతీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. వైరల్‌గా మారిన వీడియోను పరిశీలించిన అనంతరం ఫిర్యాదు చేసినట్లు స్మృతీ సింగ్ తెలిపారు. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిని అవమానించేలా, గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా రుచికా సింగ్ వ్యాఖ్యలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
దర్యాప్తులో భాగంగా రుచికా సింగ్ నోయిడాలోని సెక్టర్-168లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, ఘటన ఢిల్లీలో చోటుచేసుకున్న నేపథ్యంలో కేసును తదుపరి విచారణ కోసం ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. అయితే వీడియో వైరల్ అయిన తర్వాత నుంచి రుచికా సింగ్ ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు. ఆమె ఓ బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కుటుంబ సభ్యుల వివరాలు, ఆమె ప్రస్తుత ఆచూకీపై కూడా పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రుచికా సింగ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగ పదవుల పట్ల గౌరవం పాటించాల్సిన అవసరాన్ని పలువురు నొక్కిచెబుతూ, అసభ్యకర వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. మరోవైపు, కేసు బదిలీ అనంతరం ఢిల్లీ పోలీసులు తదుపరి విచారణను వేగవంతం చేసే అవకాశముంది.





