ప్రియాంక వ్యాఖ్యలపై విద్యావేత్తల అభ్యంతరం.
• ‘గోమూత్ర నిపుణుడు’ కామెంట్స్‌పై 215 మంది బహిరంగ లేఖ.
ఢిల్లీ, మహా.
యాంటీ పేపర్ లీక్ బిల్లుపై పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన ‘గోమూత్ర నిపుణుడు’ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా 215 మంది విద్యావేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రియాంక గాంధీకి బహిరంగ లేఖ రాశారు. పరీక్షల సంస్కరణల కమిటీకి నాయకత్వం వహిస్తున్న ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటిని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యావేత్తలు తమ లేఖలో మాట్లాడుతూ, ప్రజా జీవితంలో ఉన్న నాయకులు చేసే వ్యాఖ్యలు వ్యక్తిగత స్థాయిని దాటి విద్యా, పరిశోధన రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నిపుణులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చని, అయితే అవి వారి ఆలోచనలు, విధానాలకే పరిమితం కావాలని సూచించారు. వ్యక్తిగతంగా కించపరిచే వ్యాఖ్యలు రాజ్యాంగం ప్రోత్సహించే శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు ఎలాంటి అవమానకర చిత్రీకరణల భయం లేకుండా ప్రజా ప్రయోజన అంశాలపై స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వెల్లడించే వాతావరణం ఉండాలని వారు కోరారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఇప్పటివరకు 150కిపైగా పరిశోధన పత్రాలు ప్రచురించడంతో పాటు 50కుపైగా పరిశోధన ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. డీఆర్‌డీఓ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్న ఆయన వంటి శాస్త్రవేత్తను లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు విద్యా, పరిశోధన రంగాల ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాలతో పాటు విద్యా రంగంలోనూ చర్చ కొనసాగుతోంది.





