Mahaa Daily Exclusive

  ధరణి భూ అక్రమాలపై ఉక్కుపాదం….

Share

ధరణి భూ అక్రమాలపై ఉక్కుపాదం.
* ఎంతటివారినైనా వదిలిపెట్టం.
* ‘భూధార్’తో భూములకు ప్రత్యేక గుర్తింపు.
* రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.18 వేల కోట్లకు చేరే అవకాశం.
* రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

హైదరాబాద్, మహా.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ వేదికగా జరిగిన భూ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ధరణి నుంచి ప్రస్తుతం అమల్లోకి వచ్చిన ‘భూభారతి’ వరకు జరిగిన ప్రతి భూ లావాదేవీని క్షుణ్నంగా పరిశీలిస్తామని, పేదల భూములను కబ్జా చేసిన వారిని ఎంతటి ప్రభావశీలులైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. త్వరలోనే ఫాస్ట్‌ట్రాక్ విధానంలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

శుక్రవారం విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి మాట్లాడుతూ, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందన్నారు. భూముల రికార్డుల్లో జరిగిన అవకతవకలు, అక్రమ బదిలీలు, పేదల భూముల ఆక్రమణలపై లోతైన విచారణ కొనసాగుతోందని చెప్పారు. దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత పారదర్శకంగా మార్చేందుకు ‘భూధార్’ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఆధార్ నంబర్ తరహాలో ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేకమైన ‘భూధార్’ గుర్తింపు సంఖ్య కేటాయించనున్నట్లు వెల్లడించారు. దీంతో భూముల గుర్తింపు, యాజమాన్య వివరాలు, లావాదేవీల నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతాయని చెప్పారు.

ప్రభుత్వం కొత్తగా ఒక్క అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని పొంగులేటి స్పష్టం చేశారు. గతంలో నిషేధిత జాబితాలో చేర్చిన భూములపై సమగ్ర పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 276 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని వెల్లడించారు. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి త్వరలో సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని, ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తేల్చిచెప్పారు.

‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై కూడా మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు నిలిపివేయబోమని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వనరులతోనే నిధులు విడుదల చేస్తూ పథకాన్ని నిరంతరంగా అమలు చేస్తుందని తెలిపారు.

భూముల మార్కెట్ విలువల సవరణ తర్వాత రిజిస్ట్రేషన్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని మంత్రి వెల్లడించారు. భూముల ధరల సవరణ కారణంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఆదాయం 10 నుంచి 20 శాతం వరకు పెరిగిందని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల సంఖ్య కూడా గణనీయంగా అధికమైందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.18,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.