Mahaa Daily Exclusive

  తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకుపోతోంది…

Share

తలసరి ఆదాయంలో తెలంగాణ దూసుకుపోతోంది.
* అభివృద్ధిలో కొత్త రికార్డులు.
* రూ.4.18 లక్షలకు చేరిన తలసరి ఆదాయం.
* పెట్టుబడులు, ఉపాధి, పరిశ్రమలతో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం.
* సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్, మహా.
తెలంగాణ ఆర్థికాభివృద్ధి దేశంలోనే కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.38,900 పెరుగుదల నమోదైందని వెల్లడించారు. ఒకే ఏడాదిలో 10.23 శాతం వృద్ధి నమోదు కావడం తెలంగాణ బలమైన ఆర్థిక ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తలసరి ఆదాయంపై ప్రచురితమైన వార్తా కథనానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పంచుకున్న ముఖ్యమంత్రి, దేశంలో అత్యుత్తమ ఆర్థిక పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక విస్తరణ, ఉపాధి అవకాశాల పెరుగుదల, సమర్థవంతమైన పాలన వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానపరమైన సంస్కరణలు, పారదర్శక పరిపాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కారణంగా తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని సీఎం తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం, కొత్త పరిశ్రమలు ఏర్పడటం, ఉపాధి అవకాశాలు విస్తరించడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయని అన్నారు.

ఈ అభివృద్ధి ఫలాలు కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా మహిళలు, రైతులు, యువత జీవితాల్లోనూ ప్రతిఫలిస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

గత దశాబ్దంలో ఏర్పడిన నిరాశను తొలగించి ప్రజల్లో కొత్త ఆశావాదాన్ని నింపగలిగామని సీఎం అన్నారు. తెలంగాణను దేశంలోనే అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి సృష్టిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

రానున్న సంవత్సరాల్లో మరిన్ని దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ, పరిశ్రమల విస్తరణకు ఊతమిస్తూ, యువతకు అధిక ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కార్యాచరణ కొనసాగిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో తెలంగాణ ఆర్థికాభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.