Mahaa Daily Exclusive

  భారతీయ సంస్కృతిలోనే మధ్యవర్తిత్వం అంతర్భాగం….

Share

భారతీయ సంస్కృతిలోనే మధ్యవర్తిత్వం అంతర్భాగం.
• వివాదాల పరిష్కారంలో సంప్రదింపులే తొలి అడుగు.
• వేదాల నుంచి గాంధీ వరకు మధ్యవర్తిత్వ సంప్రదాయాన్ని గుర్తు చేసిన ప్రధాన న్యాయమూర్తి
సీజేఐ సూర్యకాంత్.

జైపూర్, మహా.
వివాదాలను పరస్పర అంగీకారంతో, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం భారతీయ నాగరికతలో శతాబ్దాలుగా కొనసాగుతున్న గొప్ప సంప్రదాయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. జైపూర్‌లో నిర్వహించిన కామన్వెల్త్ మధ్యవర్తిత్వ సదస్సు రెండో రోజు శనివారం ప్రసంగించిన ఆయన, మధ్యవర్తిత్వం అనేది చట్టబద్ధమైన వ్యవస్థగా రూపుదిద్దుకునే ముందే భారతీయుల జీవన విధానంలో భాగమైందని స్పష్టం చేశారు.

2023లో మధ్యవర్తిత్వ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ, ఈ విధానం వేల ఏళ్లుగా భారత సంస్కృతిలో కొనసాగుతోందని సీజేఐ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో శాసన, న్యాయవ్యవస్థలు ఈ విధానాన్ని మరింత బలోపేతం చేశాయని చెప్పారు.

ఈ సందర్భంగా మధ్యవర్తిత్వ ప్రాముఖ్యతను వివరించేందుకు ఆయన ఇద్దరు సోదరీమణుల కథను ఉదాహరణగా చెప్పారు. ఒక నారింజ పండును ఇద్దరూ కోరుకోవడంతో చెరిసగం పంచుకున్నారని, అయితే ఒకరికి గుజ్జు, మరొకరికి తొక్క మాత్రమే అవసరమనే విషయాన్ని ముందుగానే పరస్పరం చెప్పుకుని ఉంటే ఇద్దరికీ పూర్తి ప్రయోజనం చేకూరేదని వివరించారు. సంభాషణ, పరస్పర అవగాహన ద్వారానే వివాదాలకు సమర్థవంతమైన పరిష్కారం లభిస్తుందనే సందేశాన్ని ఆయన ఈ ఉదాహరణ ద్వారా ఇచ్చారు.

వేదాలు, రామాయణం, మహాభారతం వంటి భారతీయ ప్రాచీన గ్రంథాల్లో కూడా మధ్యవర్తిత్వానికి సంబంధించిన అనేక విలువైన సూత్రాలు ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో పేర్కొన్న సామ, దాన, భేద, దండోపాయం అనే నాలుగు విధానాల్లో తొలి పద్ధతి అయిన ‘సామ’ నుంచే ఆధునిక మధ్యవర్తిత్వ విధానం ఉద్భవించిందని విశ్లేషించారు.

ప్రాచీన భారతీయ సమాజంలో వివాదాలు తలెత్తితే ముందుగా కుటుంబ స్థాయిలో, ఆ తర్వాత వర్గం, అనంతరం సభ స్థాయిలో పరిష్కరించే ప్రయత్నం జరిగేదని, ఇవన్నీ విఫలమైన తర్వాతే రాజును ఆశ్రయించేవారని ఆయన తెలిపారు. అంటే ఏ సమస్యకైనా తొలి పరిష్కారం సంప్రదింపులు, పరస్పర చర్చలేనని స్పష్టం చేశారు.

మహాత్మా గాంధీ న్యాయవాదిగా పనిచేసిన రోజుల్లో ఇరుపక్షాల మధ్య స్నేహపూర్వక రాజీ కుదర్చడమే తన వృత్తి జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన అనుభవమని చెప్పిన విషయాన్ని కూడా సీజేఐ ప్రస్తావించారు. మధ్యవర్తిత్వం అనేది కేవలం చట్టపరమైన ప్రక్రియ మాత్రమే కాకుండా భారతీయుల ఆలోచనా విధానంలో, సంస్కృతిలో, జీవన విధానంలో విడదీయరాని భాగమని జస్టిస్ సూర్యకాంత్ తన ప్రసంగంలో ఉద్ఘాటించారు.