Mahaa Daily Exclusive

  హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2026…

Share

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2026.
* భారత్‌కు ఊరట.. అమెరికాకు షాక్.
*నాలుగు స్థానాలు ఎగబాకి 81వ ర్యాంక్‌కు చేరిన భారత పాస్‌పోర్ట్.
* అగ్రస్థానాన్ని పదిలపరుచుకున్న సింగపూర్.
ఢిల్లీ, మహా.

ప్రపంచ దేశాల పాస్‌పోర్ట్‌ల బలం, అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను అంచనా వేసే ప్రతిష్ఠాత్మక ‘హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్-2026’ జాబితాలో భారత పాస్‌పోర్ట్ ఆశాజనక పురోగతి సాధించింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్, ఈసారి నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 81వ ర్యాంక్‌కు చేరుకుంది. తాజా నివేదిక ప్రకారం, భారత పాస్‌పోర్ట్ కలిగిన పౌరులు ప్రస్తుతం 55 దేశాలకు ముందస్తు వీసా లేకుండా లేదా వీసా-ఆన్-అరైవల్ సౌకర్యంతో ప్రయాణించే అవకాశం ఉంది. కొన్ని దేశాల వీసా విధానాల్లో వచ్చిన మార్పుల కారణంగా గత ఏడాదితో పోలిస్తే వీసా ఫ్రీ దేశాల సంఖ్య 57 నుంచి 55కు తగ్గినప్పటికీ, ఓవరాల్ ర్యాంకింగ్‌లో భారత్ మెరుగైన స్థానాన్ని సాధించడం గమనార్హం. భారత్ ర్యాంకింగ్ ఎగబాకడం మన పౌరులకు అంతర్జాతీయ ప్రయాణ అవకాశాలు మరింత విస్తరిస్తున్నాయనడానికి సానుకూల సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, అగ్రరాజ్యం అమెరికాకు ఈ జాబితాలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా అమెరికా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ దిగజారిపోయింది. ప్రస్తుతం 30కి పైగా దేశాల పాస్‌పోర్ట్‌లు అమెరికా కంటే మెరుగైన స్థానాల్లో నిలవడం గమనార్హం. అయితే, దీనిని అమెరికా ప్రభావం తగ్గినట్లుగా భావించకూడదని, ప్రపంచంలోని అనేక దేశాలు కొత్త ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా తమ పౌరులకు వీసా నిబంధనలను వేగంగా సులభతరం చేసుకోవడమే అమెరికా వెనుకబడటానికి ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ జాబితాలో సింగపూర్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అగ్రస్థానాన్ని పదిలపరుచుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాయి.
స్వీడన్ మూడో స్థానాన్ని కైవసం చేసుకోగా.. బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలు టాప్-10లో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి. హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనేది కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాల ఆధారంగానే రూపొందిస్తారని, ఇది ఆయా దేశాల ఆర్థిక, సైనిక లేదా రాజకీయ బలాలకు సూచిక కాదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ప్రపంచ దేశాలు ప్రయాణ స్వేచ్ఛను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు అంతర్జాతీయ అనుసంధానానికి కొత్త ఊతమిస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.