ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి.
* నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం.
* సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టికి సూసైడ్ నోట్.
* ముదిగొండ మండలం లక్ష్మీపురంలో కలకలం.
* ఖమ్మం ఆసుపత్రిలో పరామర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు.
ఖమ్మం, మహా.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఏళ్ల తరబడి సన్నద్ధమవుతున్న ఓ నిరుద్యోగి, నోటిఫికేషన్లు సకాలంలో రాకపోవడం.. కుటుంబ ఆర్థిక పరిస్థితులు వెక్కిరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తూ, తన కష్టాలను వివరిస్తూ ఆ యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలకు ఉద్దేశించి రాసిన సూసైడ్ నోట్ స్థానికంగా కలకలం రేపుతోంది.
గ్రామానికి చెందిన గడ్డం వేణు కుమార్ గత ఐదేళ్లుగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్ తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. అయితే, ఏళ్లు గడుస్తున్నా తగిన నోటిఫికేషన్లు రాకపోవడం, వయోపరిమితి దాటిపోతుండటంతో అతడు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాడు. దీనికి తోడు తల్లికి ఉన్న మానసిక అనారోగ్యం, అక్క ఆరోగ్య సమస్యలు, పదేళ్లుగా సొంతిల్లు లేని పేదరికం ఆ యువకుడిని మరింత కుంగదీశాయి.
**సూసైడ్ నోట్లో ఏముందంటే..**
“నా మరణానికి కారణం సరైన సమయానికి గ్రూప్స్ నోటిఫికేషన్లు రాకపోవడమే. మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పడంతోనే నిరుద్యోగులంతా కాంగ్రెస్ను గెలిపించారు. కానీ గత ప్రభుత్వంలో మిగిలిపోయిన నోటిఫికేషన్లు పూర్తి చేశారు తప్ప, గత ఎనిమిది నెలలుగా కొత్త జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. పదేళ్లకోసారి పంచవర్ష ప్రణాళికల్లా కాకుండా, ఏటా ఒక నోటిఫికేషన్ (ఒక ఏడాది గ్రూప్-1, మరో ఏడాది గ్రూప్-2 ఇలా..) ఇస్తే అభ్యర్థులు వయసు, సమయం కోల్పోకుండా ఉంటారు.” అని వేణు తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు.
**డిప్యూటీ సీఎం భట్టి గారు చొరవ తీసుకోవాలి..**
“మాది మధిర నియోజకవర్గం పరిధిలోని న్యూ లక్ష్మీపురం. మా అమ్మ మానసిక వికలాంగురాలు. మాకు ఇల్లు లేదు, గతంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. పదేళ్లుగా ఇల్లు లేకుండానే ఉంటున్నాము. మా నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. నా ఈ లేఖను సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారికి చేరేలా సోషల్ మీడియాలో షేర్ చేయండి” అని వేణు తన లేఖలో విజ్ఞప్తి చేశాడు. లేఖ చివర్లో..
*”రగులుతుంది నిరుద్యోగి కాగడా..*
*విషాదమై ఎగిసిపడుతుంది ప్రభుత్వం గుండెల నిండా..”* అంటూ తన ఆవేదనను కవితా రూపంలో వ్యక్తం చేశాడు.
**బాధితుడిని పరామర్శించిన బీజేపీ నేతలు**
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణును బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు, ఇతర నాయకులు పరామర్శించారు. యువకుడి ఆరోగ్య పరిస్థితిని, జరిగిన ఘటనను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు మాట్లాడుతూ.. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. యువత ప్రాణాల మీదకు తెచ్చుకోకముందే, ప్రభుత్వం తక్షణమే స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.







