వన్డే వరల్డ్‌కప్‌కు క్వాలిఫైయర్ షెడ్యూల్ ఖరారు.
• ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు అర్హత పోరు.
ఢిల్లీ, మహా.
2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు సంబంధించిన క్వాలిఫైయర్ టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు క్వాలిఫైయర్ మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న వేదికలను మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
2027 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫైయర్ టోర్నీలో తలపడనున్నాయి. ఇందులో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధిస్తుంది. రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లు తదుపరి దశలో జరిగే ‘సూపర్ సిరీస్’ ద్వారా ప్రపంచకప్‌లో చోటు కోసం మరోసారి పోటీ పడనున్నాయి.
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అట్టడుగు స్థానాల్లో ఉన్న రెండు పూర్తి సభ్య దేశాలతో పాటు సీడబ్ల్యూసీ లీగ్-2 నుంచి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రధాన క్వాలిఫైయర్‌లో బరిలోకి దిగనున్నాయి. మిగిలిన నాలుగు స్థానాల కోసం ప్రత్యేకంగా ప్రపంచకప్ క్వాలిఫైయర్ ప్లేఆఫ్ నిర్వహించనున్నారు. లీగ్-2లో చివరి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు, ఛాలెంజ్ లీగ్ నుంచి వచ్చిన నాలుగు జట్లు ఈ ప్లేఆఫ్‌లో తలపడతాయి. వాటిలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్రధాన క్వాలిఫైయర్‌కు అర్హత సాధిస్తాయి.
ఈసారి 14 జట్లతో వన్డే ప్రపంచకప్ నిర్వహించనున్న నేపథ్యంలో అర్హత పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది. ప్రపంచకప్ బెర్త్ కోసం అసోసియేట్ జట్లతో పాటు పూర్తి సభ్య దేశాలు కూడా పోటీపడనున్నందున క్వాలిఫైయర్ టోర్నీపై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.







