Mahaa Daily Exclusive

  పెద్ది సుదర్శన్‌ కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం…

Share

పెద్ది సుదర్శన్‌ కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం.
* నల్లబెల్లిలో కుటుంబాన్ని పరామర్శించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్.

వరంగల్‌,మహా.

మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదివారం వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్‌ జిల్లా ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం రూ.25 లక్షలు కేటాయించనున్నారు. మొత్తం రూ.2.25 కోట్లను బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పిల్లల భవిష్యత్తు, చదువు, కుటుంబ సంక్షేమానికి పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్‌ హామీ ఇవ్వనున్నారు.

ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి గత నెల 26న హనుమకొండలో ఛాతీలో నొప్పి రావడంతో రోహిణి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్‌ అరెస్ట్‌గా గుర్తించి సీపీఆర్‌ నిర్వహించారు. సుమారు గంటపాటు ప్రయత్నించి తొమ్మిదిసార్లు సీపీఆర్‌ చేయడంతో కొంత స్పందన కనిపించడంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన గత నెల 31న కన్నుమూశారు.

ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి..

1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో నర్సంపేట నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2016లో తెలంగాణ సివిల్‌ సప్లయ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2018 ఎన్నికల్లో నర్సంపేట నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2017లో లక్ష్మీ ప్రసన్నను వివాహం చేసుకున్నారు.