Mahaa Daily Exclusive

  చెన్నైలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ….

Share

చెన్నైలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ.
• ‘నేషన్‌ ఫస్ట్‌’ స్ఫూర్తితో యువత ముందుకు రావాలి.
• పొంగులేటి సుధాకర్ రెడ్డి.

చెన్నై, మహా.

దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ చెన్నైలో ఆదివారం హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ ఘనంగా జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ జాతీయ సహ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, న్యాయవాదులు, వైద్యులు, యువత, వివిధ వృత్తులకు చెందిన ప్రతినిధులు జాతీయ పతాకాలను చేతబూని ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

మా.పొ.సి. (ఎం.పి. శివజ్ఞానం) విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ బీజేపీ తమిళనాడు రాష్ట్ర కార్యాలయం కమలాలయం వరకు సాగింది. మార్గమంతా జాతీయ జెండాలతో సందడి నెలకొనగా, దేశభక్తి నినాదాలతో పరిసరాలు మార్మోగాయి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డోరిస్వామి, రాష్ట్ర కార్యదర్శులు తగరాజ్‌, వినోజ్‌, సంపత్‌తో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు, సీనియర్‌ నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నైనార్‌ నాగేంద్రన్‌ మాట్లాడుతూ దేశం అన్నింటికంటే ముందనే ‘నేషన్‌ ఫస్ట్‌’ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, ‘ఏక్‌ భారత్‌.. శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తితో జాతీయ సమైక్యతను మరింత బలోపేతం చేయాలని అన్నారు. భిన్న ప్రాంతాలు, సంస్కృతులు, వర్గాల మధ్య పరస్పర అవగాహన, సాంస్కృతిక మార్పిడిని పెంపొందించడం ద్వారా దేశ ఐక్యత మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

అనంతరం యువతను ఉద్దేశించి డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని అన్నారు. యువత మాదకద్రవ్యాల సంస్కృతికి, సంఘవిద్రోహ శక్తులకు దూరంగా ఉండి నిర్మాణాత్మక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. తమ శక్తి, ప్రతిభ, ఆలోచనా సామర్థ్యాన్ని దేశ ప్రగతికి వినియోగించాలని పిలుపునిచ్చారు.

‘నేషన్‌ ఫస్ట్‌’ను ప్రాధాన్యంగా తీసుకుని దేశాభివృద్ధిలో యువత చురుకైన భాగస్వాములు కావాలని సుధాకర్‌రెడ్డి కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్‌ భారత్‌ లక్ష్య సాధనకు యువత అంకితభావంతో పనిచేయాలని అన్నారు. దేశ ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం కేవలం జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమం మాత్రమే కాదని సుధాకర్‌రెడ్డి అన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, త్యాగం, దేశ భవిష్యత్తుపై ప్రతి పౌరుడి బాధ్యతను గుర్తుచేసే ఉద్యమమని పేర్కొన్నారు. తిరంగాపై ఉన్న గౌరవం ఒకరోజు కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రతిరోజూ దేశం కోసం పనిచేసే స్ఫూర్తిగా మారాలని అన్నారు.

తమిళనాడులోని ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేసి హర్‌ ఘర్‌ తిరంగా స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, అభివృద్ధి, సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే బలమైన, సంపన్నమైన, అభివృద్ధి చెందిన భారత్‌ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.