- విజయపురిలో మార్మోగిన వేదఘోష
- కృష్ణమ్మ ఒడ్డున వరుణుడి కరుణ కోసం తెలంగాణ ప్రార్థన
- నాగార్జునసాగర్‌లో 108 మంది రుత్వికులతో మహా వరుణ యాగం
నాగార్జునసాగర్, మహా : తెల్లవారుజామున సూర్యకిరణాలు ఇంకా కృష్ణమ్మ జలాలను తాకకముందే… నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేదమంత్రాలు మార్మోగాయి. వర్షాలకు, జలాలకు అధిదేవత అయిన వరుణుడి కరుణ తెలంగాణపై ప్రసరించాలని కోరుతూ రుత్వికులు చేసిన మంత్రోచ్చారణతో కృష్ణాతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నాగార్జునసాగర్ తీరంలోని విజయ్ విహార్‌లో సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా–గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు నిండాలని, రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరియాలని సంకల్పిస్తూ 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ శాసనసభ్యురాలు పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉదయం నుంచే యాగ క్రతువుల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలకు చెందిన మంత్రాలను వేదపండితులు పారాయణం చేశారు. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆసీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేదపారాయణం, జపంలో పాల్గొన్నారు.
చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం–జలం–భూమి–మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేదమంత్రాల నడుమ హోమద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి… మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు… వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది.
విజయపురికి వరుణారాధనతో ప్రాచీన అనుబంధం
మహా వరుణ యాగం నిర్వహిస్తున్న ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నాగార్జునసాగర్ ప్రాంతం ఒకనాటి విజయపురిగా ప్రసిద్ధి చెందిందని, ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని వేదపండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరచబడి ఉందని వారు పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన… ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనిస్తోందన్న భావన యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన వేదపండితులు, అర్చకులు యాగ నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతో పాటు పలువురు వేదపండితులు యాగ క్రతువులను నిర్వహిస్తున్నారు.
తెలంగాణకే కాదు… ఎగువ పరీవాహక ప్రాంతాలకూ వర్షాలు కురవాలని సంకల్పం
ఈ యాగంలో చేసిన సంకల్పం నాగార్జునసాగర్‌కో, తెలంగాణలోని ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా, సమానంగా వర్షాలు కురవాలని రుత్వికులు ప్రార్థిస్తున్నారు. అంతేకాదు… కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవాలని, తద్వారా రెండు మహానదులకు నిరంతర ప్రవాహాలు వచ్చి తెలంగాణ జలాశయాలు నిండాలని సంకల్పించారు. చెరువులు కళకళలాడాలని… భూగర్భ జలాలు పెరగాలని… సాగులో ఉన్న ఖరీఫ్ పంటలకు నీటి కొరత రాకూడదని… రైతాంగం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడిని ప్రార్థించారు.
ప్రస్తుత వర్షాకాలంలో వర్షపాతం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేకపోవడం, రానున్న రోజుల్లో వర్షాల తీరుపై నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక ప్రార్థనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు ఇంజినీర్లు జలాశయాల్లో నీటి నిల్వలు, నదుల్లో ప్రవాహాలు, సాగునీటి అవసరాలను నిరంతరం పరిశీలిస్తుంటే… మరోవైపు ఆ జలాలన్నింటికీ మూలమైన ఆకాశం వైపు విజయపురి నుంచి వేదమంత్రాలతో ప్రార్థనలు సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మహా వరుణ యాగం రోజంతా కొనసాగనుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహించగా, ముగింపు క్రతువుల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
అయితే ఉదయం నుంచి విజయపురిలో కనిపించిన దృశ్యం మాత్రం అపూర్వం. విశాలమైన నాగార్జునసాగర్ జలరాశిని సాక్షిగా చేసుకుని… పవిత్ర హోమాగ్నులు ప్రజ్వలిస్తుండగా… 108 మంది రుత్వికుల వేదఘోష ఏకస్వరంతో కృష్ణాతీరాన్ని నింపింది. భాష వేల ఏళ్ల నాటిది కావచ్చు…కానీ ఆ మంత్రాల వెనుక ఉన్న ఆకాంక్ష మాత్రం…వరుణుడు కరుణించాలని…తెలంగాణ నేలపై సమృద్ధిగా వర్షాలు కురవాలని…కృష్ణా–గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని…చెరువులు, జలాశయాలు నిండాలని…ఆకాశం వైపు చూసే అన్నదాత కళ్లలో ఆందోళన కాదు—ఆశ కనిపించాలన్నది మహవరుణ యాగం సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.







