నాగార్జునసాగర్,మహా.
ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు పే స్కేల్ అమలు చేయాలని తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు అన్నావజ్జల ప్రసాద్‌శర్మ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని కోరారు. నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగానికి ముఖ్యమంత్రి హాజరైన సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోని దేవాలయాల్లో ఎన్నో సంవత్సరాలుగా ధూపదీప నైవేద్య సేవలు అందిస్తున్న అర్చకులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ప్రసాద్‌శర్మ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొనే వర్గ విభేదాల కారణంగా అర్చకులు అవమానాలు, బెదిరింపులకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయని తెలిపారు. అర్చకులు నిర్భయంగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ధూపదీప నైవేద్య అర్చకుల సేవలను గుర్తించి వారికి పే స్కేల్ వర్తింపజేయాలని కూడా కోరారు. అర్చకుల కుటుంబాల జీవన భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, దీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారికి న్యాయం జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించేందుకు సహకరించిన అర్చక ఉద్యోగ సంయుక్త కార్యాచరణ సమితి అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చక సంయుక్త కార్యాచరణ సమితి కన్వీనర్ పరాంకుశం రవీంద్రాచార్యులకు ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం తరఫున ప్రసాద్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేగ్గళం సంతోష్‌శాస్త్రి, కోశాధికారి గాండ్ల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ టి. వెంకటద్రి స్వామి, వ్యవస్థాపక ధర్మకర్త సభ్యులు మునగలేటి రమేష్‌శర్మ, ఓరుగంటి మాధవాచార్యులు, జంగం మహేష్, శ్రీరంగం గోపీకృష్ణమాచార్యులు, మరింగంటి భార్గవాచార్యులు, వి. శ్రీనివాసమూర్తి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణవ్యాప్తంగా ఉన్న ధూపదీప నైవేద్య అర్చక కుటుంబాల తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుకు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అర్చకుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.








