Mahaa Daily Exclusive

  డీజిల్‌లో ఇథనాల్‌కు బ్రేక్..! భద్రతా ప్రమాణాలపై కేంద్రం కీలక నిర్ణయం..

Share

  •  భద్రతా ప్రమాణాలపై కేంద్రం కీలక నిర్ణయం.
  •  ఫ్లాష్ పాయింట్ తగ్గడంతో ప్రతిపాదన నిలిపివేత.
  • ఈ20కి మించి వెళ్లడంపై ఇంకా నిర్ణయం లేదు.

ఢిల్లీ, మహా.

పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ డీజిల్‌లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని అమలు చేయకూడదని నిర్ణయించింది. ఇథనాల్‌ను డీజిల్‌లో కలిపినప్పుడు ఇంధనం ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు నిర్వహించిన పరీక్షల్లో వెల్లడికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో వెల్లడించారు.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన పరిశోధన, అభివృద్ధి కేంద్రాల్లో ఇథనాల్-డీజిల్ మిశ్రమంపై విస్తృతంగా పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. ఈ పరీక్షల్లో గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ఆటోమొబైల్ కంపెనీలు, ఇతర సాంకేతిక సంస్థలు కూడా భాగస్వాములయ్యాయని చెప్పారు. ఇథనాల్ కలిపిన డీజిల్ నిర్దేశిత ఫ్లాష్ పాయింట్ ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు పరీక్షల్లో తేలిందని వెల్లడించారు.

ఫ్లాష్ పాయింట్ ఎందుకు కీలకం?

ఇంధనం నుంచి వెలువడే ఆవిరి గాలితో కలిసి బాహ్య జ్వాల లేదా నిప్పురవ్వ తగిలినప్పుడు క్షణకాలం మండే అత్యల్ప ఉష్ణోగ్రతను ఫ్లాష్ పాయింట్ అంటారు. ఫ్లాష్ పాయింట్ తక్కువగా ఉన్నంత మాత్రాన ఇంధనం ఆ ఉష్ణోగ్రత వద్ద తనంతట తానే మండిపోతుందని అర్థం కాదు. అయితే బాహ్య ఇగ్నిషన్ సోర్స్ అందుబాటులో ఉన్నప్పుడు ఇంధన ఆవిరి మండే అవకాశం పెరుగుతుంది.

డీజిల్‌ను భారీ స్థాయిలో నిల్వ చేయడం, ట్యాంకర్ల ద్వారా రవాణా చేయడం, పెట్రోల్ బంకుల్లో నిల్వ చేయడం వంటి సందర్భాల్లో ఇంధన భద్రత అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో ఇథనాల్ కలపడం వల్ల డీజిల్ ఫ్లాష్ పాయింట్ తగ్గడం భద్రతాపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉందని పరీక్షల్లో తేలడంతో ఈ ప్రతిపాదనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు కేంద్రం తెలిపింది.

ఈ 20కి మించి ఇథనాల్ కలుపుతారా?

డీజిల్‌లో ఇథనాల్ మిశ్రమ ప్రతిపాదనను నిలిపివేసిన నేపథ్యంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే అంశంపైనా చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ 20 అంటే 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్‌ను మించి వెళ్లే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే ప్రతిపాదన వస్తే ముందుగా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

ఆటోమొబైల్ కంపెనీలు, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఇతర సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

ఈ 20పై కేంద్రం వాదన ఇదీ..

ఈ 20 పెట్రోల్ వినియోగం సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇతర ఆటోమొబైల్ సంస్థలు E20పై ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపింది.

ఈ పరీక్షల్లో ఇంజిన్ జీవితకాలం, వాహనం స్టార్టింగ్, డ్రైవింగ్ పనితీరు, తుప్పు ప్రభావం, వివిధ పదార్థాలతో ఇంధన అనుకూలత, ఇంధన సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పరీక్షల ఆధారంగా ఈ 20 ఇంధనం నిర్దేశిత ప్రమాణాల పరిధిలో సురక్షితమేనని పేర్కొంది.

పాత వాహనాలపై ప్రభావం ఎంత?

ఇప్పటికే రోడ్లపై ఉన్న పాత వాహనాలు ఈ 20 ఇంధనాన్ని వినియోగించడం వల్ల భారీ స్థాయిలో పనితీరు సమస్యలు లేదా నష్టాలను ఎదుర్కొంటున్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవని కేంద్రం తెలిపింది. దేశంలో ఈ 15కి మించిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ మూడేళ్లకు పైగా, ఈ 19- ఈ 20 మిశ్రమ ఇంధనం రెండున్నర సంవత్సరాలకు పైగా వినియోగంలో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు.

దేశవ్యాప్తంగా 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు, 3 కోట్లకు పైగా పెట్రోల్ కార్లు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్ మిశ్రమానికి, విస్తృత స్థాయిలో ఇంజిన్ వైఫల్యాలు లేదా వాహనాల బ్రేక్‌డౌన్‌లకు ప్రత్యక్ష సంబంధం ఉందని నిరూపించే ధృవీకరించదగిన ఆధారాలు ఇప్పటివరకు లేవని కేంద్రం పేర్కొంది.

మొత్తంగా డీజిల్‌లో ఇథనాల్ కలపడం వల్ల ఫ్లాష్ పాయింట్ తగ్గి భద్రతా ప్రమాణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పరీక్షల్లో తేలడంతో కేంద్రం ఆ ప్రతిపాదనను ప్రస్తుతానికి నిలిపివేసింది. మరోవైపు పెట్రోల్‌లో ఈ 20కి మించి ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలతో పాటు పరిశ్రమ వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే దీనిపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Latest