- ప్రపంచ స్థాయి క్రికెట్ కేంద్రం.
- జై షా పట్టుదలతో రూపుదిద్దుకున్న అత్యాధునిక కేంద్రం.
- రెండేళ్లలోనే భారీ మౌలిక సదుపాయాలు.
బెంగళూరు, మహా.
ఒకప్పుడు ఖాళీగా ఉన్న 40 ఎకరాల భూమి.. నేడు భారత క్రికెట్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అత్యాధునిక కేంద్రంగా మారింది. బెంగళూరులో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేశంలోనే అత్యున్నత క్రికెట్ మౌలిక సదుపాయాలకు చిరునామాగా నిలిచింది. ఈ భారీ ప్రాజెక్టు రూపుదిద్దుకోవడంలో మాజీ కార్యదర్శి, అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రస్తుత ఛైర్మన్ జై షా కీలక పాత్ర పోషించారని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.
ఇటీవల భారత క్రికెటర్ల గాయాలు, ఫిట్‌నెస్ అంశాల నేపథ్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వార్తల్లో నిలుస్తున్న వేళ.. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఇతర బోర్డు అధికారులు కేంద్రాన్ని సందర్శించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధిపతి వీవీఎస్ లక్ష్మణ్‌తో సమావేశమై అక్కడి కార్యకలాపాలు, ఆటగాళ్లకు అందుతున్న సేవలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు.
అడ్డంకులన్నీ అధిగమించి..
కొత్త క్రికెట్ అకాడమీ నిర్మాణానికి తొలినాళ్లలో అనేక న్యాయపరమైన, పరిపాలనా సమస్యలు ఎదురయ్యాయని సైకియా వివరించారు. 40 ఎకరాల భూమి ఖాళీగా ఉండటంతో దాన్ని తిరిగి తీసుకునేందుకు పలువురు ప్రయత్నించారని, భూమికి సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో జై షా ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. బీసీసీఐ అత్యున్నత మండలిలోని సభ్యులందరినీ ఒప్పించి నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్న నిర్ణయానికి తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదేనని పేర్కొన్నారు.
తాత్కాలికంగా కొనసాగుతున్న జాతీయ క్రికెట్ అకాడమీకి బదులుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు రూపం వచ్చింది. చివరకు అన్ని అడ్డంకులను అధిగమించి 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
రెండేళ్లలోనే అద్భుత రూపం
నిర్మాణం ప్రారంభించిన కొద్ది కాలానికే ఈ ప్రాజెక్టు భారీ రూపాన్ని సంతరించుకుంది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో మూడు అంతర్జాతీయ ప్రమాణాల మైదానాలు, మొత్తం 86 పిచ్‌లు, ప్రత్యేక ఇండోర్ శిక్షణ సదుపాయాలు, క్రీడా విజ్ఞాన–వైద్య కేంద్రం, ఆధునిక వ్యాయామశాల, ఈతకొలను, ఆటగాళ్ల వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు.
ఇందులో 45 బహిరంగ సాధన పిచ్‌లతోపాటు ఎనిమిది ఇండోర్ పిచ్‌లు ఉన్నాయి. విదేశీ పర్యటనలకు వెళ్లే భారత ఆటగాళ్లు అక్కడి వాతావరణం, పిచ్ పరిస్థితులకు అనుగుణంగా సాధన చేసేందుకు వీలుగా వివిధ రకాల పిచ్‌లను ప్రత్యేకంగా రూపొందించారు. క్రీడా విజ్ఞానం, వైద్య సేవలు, పునరావాసం, ఫిట్‌నెస్ తదితర విభాగాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం ఈ కేంద్రం ప్రత్యేకత.
లక్ష్మణ్ పర్యవేక్షణలో కీలక మార్పులు
జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా రూపాంతరం చెందడంలో వీవీఎస్ లక్ష్మణ్ కూడా కీలక పాత్ర పోషించారు. నిర్మాణ దశలోనూ ఆయన సూచనలు, పర్యవేక్షణ కొనసాగాయి. భవిష్యత్ తరాల ఆటగాళ్లను తీర్చిదిద్దడంతోపాటు ప్రస్తుత భారత క్రికెటర్ల అవసరాలకు అనుగుణంగా కేంద్రాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు.
సెంటర్ నిర్మాణ సమయంలో వాస్తుశిల్పులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశాల్లో జై షా స్వయంగా పాల్గొని అనేక అంశాలను పర్యవేక్షించేవారని లక్ష్మణ్ గతంలో గుర్తుచేశారు. దాదాపు రెండేళ్ల వ్యవధిలోనే ఇంత భారీ మౌలిక సదుపాయాలు సిద్ధం కావడానికి జై షా చూపిన ఆసక్తి, పట్టుదల ముఖ్య కారణాల్లో ఒకటని పేర్కొన్నారు.
కేవలం క్రికెట్ కేంద్రం కాదు
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను కేవలం ఆటగాళ్ల పునరావాస కేంద్రంగా చూడొద్దని లక్ష్మణ్ తాజాగా స్పష్టం చేశారు. భారత ఆటగాళ్లకు అత్యున్నత స్థాయి శిక్షణ, ఫిట్‌నెస్, క్రీడా విజ్ఞానం, వైద్య సహాయం అందించడంతోపాటు ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గాయాలు వృత్తిపరమైన క్రీడల్లో సహజమేనని, ఆటగాళ్లను నిరంతరం పర్యవేక్షిస్తూ సరైన ఫిట్‌నెస్ విధానాలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని వివరించారు.
అంతేకాదు.. ఈ కేంద్రంలోని క్రీడా విజ్ఞాన, వైద్య సదుపాయాలను భారత క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఇతర క్రీడల అథ్లెట్లకు కూడా ఉపయోగపడేలా రూపొందించారు. క్రీడా విజ్ఞాన రంగంలో పరిశోధన, శిక్షణ, గాయాల నివారణ, పునరావాసం వంటి అంశాల్లో ఇది కీలక కేంద్రంగా ఎదగాలన్నది బీసీసీఐ లక్ష్యం.
భారత క్రికెట్‌కు భవిష్యత్ చిరునామా
ఒకప్పుడు ఖాళీగా ఉన్న భూమి నుంచి ప్రారంభమైన ప్రయాణం.. నేడు ప్రపంచ స్థాయి క్రికెట్ మౌలిక సదుపాయాల సముదాయంగా మారింది. నిర్మాణ దశలో ఎదురైన న్యాయ, పరిపాలనా అడ్డంకులను అధిగమించడం నుంచి అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడం వరకు ఎన్నో కీలక దశలను ఈ కేంద్రం అధిగమించింది.
భారత క్రికెట్‌లో ప్రతిభను గుర్తించడం, ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దడం, ఫిట్‌నెస్ ప్రమాణాలను పెంచడం, గాయాల నుంచి వేగంగా కోలుకునేలా చేయడం.. ఇలా అనేక రంగాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇకపై భారత క్రికెట్ భవిష్యత్ నిర్మాణంలో కీలక భూమిక పోషించనుంది.






