•రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ మంజూరుకు 10 శాతం కమిషన్
•డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
•కేసు నమోదు చేయించి దర్యాప్తు జరపాలంటూ లేఖ రాసిన న్యాయవాది రేవంత్
హైదరాబాద్, మహా : డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని భట్టిపై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిల విడుదలకు ఆమె కమీషన్ డిమాండ్ చేశారంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దీనిపై అంబర్‌పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కరుపోతుల రేవంత్, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. నిష్పక్షపాతంగా, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన గవర్నర్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లేఖ రాశారు.
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆగస్టు 9, 2026న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో, వైద్య ఆరోగ్య శాఖ రిటైర్డ్ ఉద్యోగిని, ఐఎన్ టీయుసీ అనుబంధ ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్ కే ప్రసన్నకుమారి మీడియా ముందు పలు వివరాలను బయటపెట్టారు. తనకు రావాల్సిన రూ. 40 లక్షల పదవీ విరమణ బకాయిలను క్లియర్ చేయడం కోసం 10 శాతం కమీషన్, అంటే రూ. 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే సుమారు రూ. 120 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, సంబంధిత ఫైళ్లు ముందుకు కదలాలన్నా లేదా బిల్లులు మంజూరు కావాలన్నా 6 శాతం నుండి 10 శాతం వరకు కమీషన్లు అడుగుతున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కమీషన్ల కక్కుర్తి కనిపిస్తుందని, తమ సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా, పలు ప్రధాన తెలుగు పత్రికలలో, ఛానళ్లలో వార్తలు వచ్చాయని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రాసిన లేఖలో లాయర్ కరుపోతుల రేవంత్ పేర్కొన్నారు.








