హైదరాబాద్, మహా : హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ పలు కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూభాగాలు, ప్రైమ్ ల్యాండ్ పార్సెళ్లు, లేఅవుట్ ప్లాట్ల విక్రయానికి ఈ-వేలం ప్రకటనను విడుదల చేసింది. హెచ్ఎండీఏ ఈ-వేలం ప్రకటన ద్వారా కోకాపేట, మోకిల, సరూర్ నగర్ తదితర ప్రాంతాల్లో భూములు, ప్లాట్ల విక్రయం చేయనుంది. ప్రధానంగా కొకపేట నియోపొలిస్, గోల్డెన్ మైల్ లేఅవుట్లోని ల్యాండ్ ప్యాకేజీలపై ఈ వేలం ఫోకస్ ఉంటుంది. వీటితో పాటు మోకిలా, ఇతర అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఉన్న భూములను కూడా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ-ల్యాండ్ ఆక్షన్ (ఆన్లైన్ బిడ్డింగ్) ద్వారా వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాపర్టీలకు సంబంధించి ఆసక్తి ఉన్న కొనుగోలుదారుల కోసం ఆగస్టు చివరి వారంలో ‘ప్రీ-బిడ్ సమావేశాలు’ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ మొదటి వారంలో ఆన్లైన్ బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నగరం పరిధిలో ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లు, ల్యాండ్ పార్సెల్స్, ప్రాపర్టీలను ఈ నోటిఫికేషన్లో చేర్చారు.
కోకాపేట నియోపోలిస్ 4.59 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఎకరాకు ప్రాథమిక కనీస ధర రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. గోల్డెన్ మైల్ లేఅవుట్ 0.70 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఎకరాకు ప్రాథమిక కనీస ధర రూ. 70 కోట్లుగా ఉంటుంది. ఆగస్టు 19 నుండి ఆగస్టు 25 వరకు సంబంధిత స్థలాలను బట్టి వివిధ తేదీల్లో ప్రీ-బిడ్ సమావేశాలు జరుగుతాయి. గవర్నమెంట్ ల్యాండ్ పార్సెళ్లు ఆగస్టు 24, 2026, మోకిలా అండ్ బాచుపల్లి లేఅవుట్లు సెప్టెంబర్ 02, 2026, ఇన్ముల్ నర్వ లేఅవుట్ సెప్టెంబర్ 03, 2026, సరూర్ నగర్ అండ్ హైదర్ నగర్ ల్యాండ్ పార్సెళ్లు సెప్టెంబర్ 07, 2026, కోకాపేట్ నియోపోలిస్ అండ్ గోల్డెన్ మైల్ సెప్టెంబర్ 09, 2026 తేదీల్లో ఈ వేలం జరగనుంది.
బిడ్ పత్రం రుసుము రూ. 1180, ఈఎమ్డీ చెల్లింపులు స్థలాన్ని బట్టి రూ. 3 లక్షల నుండి రూ. 5 కోట్ల వరకు దరావత్తు నిర్ణయించారు. వేలంలో గెలుపొందిన వారు ఆఫర్ లెటర్ జారీ చేసిన 7 రోజులలోపు మొత్తం విక్రయ విలువలో 25 శాతం చెల్లించాలి. మిగిలిన 75 శాతం నిధులను 60 రోజులలోపు పూర్తి స్థాయిలో చెల్లించాల్సి ఉంటుంది. వేలానికి సంబంధించిన బ్రోచర్లు డౌన్లోడ్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్, బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి hmda.gov.in/auctions/ లేదా mstcecommerce.com వెబ్సైట్లను సందర్శించవచ్చని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.








