- 89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం
- 28 కేసులు, 26 మంది అరెస్ట్
- రూ.715 కోట్లు రికవరీ
- విజిలెన్స్ దాడుల్లో విస్తుపోయే నిజాలు
హైదరాబాద్, మహా : కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి రావడం తీవ్ర సంచలనంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 89 రైస్ మిల్లుల్లో 3,72,693.23 టన్నుల ధాన్యం లెక్కల్లో కనిపించలేదని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ సుమారు రూ.927.16 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యంగా తిరిగి అప్పగించాల్సి ఉండగా.. కొంతమంది మిల్లర్లు దానిని పక్కదారి పట్టించినట్లు ప్రాథమికంగా తేలింది. విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ డీఎస్ చౌహాన్ నేతృత్వంలో జులై 21వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ధాన్యంలో ప్రతి గింజను తిరిగి రాబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడంతో అధికారులు రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 3 వారాల వ్యవధిలోనే భారీ మొత్తంలో అక్రమాలు గుర్తించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ తనిఖీల్లో మొత్తం 3,72,693.23 టన్నుల ధాన్యం లోటు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. ఇందులో కస్టమ్ మిల్లింగ్ రైస్‌కు సంబంధించిన ధాన్యం లోటు 1,84,669.88 టన్నులు కాగా.. వేలం ధాన్యం లోటు 1,88,023.35 టన్నులుగా నమోదైంది. 2022-23 యాసంగి నుంచి 2025-26 వానకాలం వరకు వివిధ సీజన్లకు సంబంధించిన ధాన్యం, ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం పక్కదారి పట్టినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 28 క్రిమినల్ కేసులు నమోదు చేసి 50 మందిని నిందితులుగా చేర్చారు. 26 మంది మిల్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్పందించని మిల్లర్లపై కేసులు, అరెస్టులతో చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు సుమారు రూ.715 కోట్ల విలువైన ధాన్యాన్ని రికవరీ చేసినట్లు సమాచారం. జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేటలో అక్రమాలు అత్యధికంగా ఉన్నట్లు వెల్లడైంది. అక్కడ 14 మిల్లుల్లో 1,29,867.36 టన్నుల ధాన్యం, సుమారు రూ.318.63 కోట్ల విలువైన అక్రమాలు గుర్తించారు. నిజామాబాద్‌లో 8 మిల్లుల్లో రూ.155.18 కోట్ల విలువైన 52,418.72 టన్నులు, జగిత్యాలలో 7 మిల్లుల్లో రూ.135.48 కోట్ల విలువైన 56,319 టన్నుల ధాన్యం లోటును గుర్తించారు. వనపర్తి, ఖమ్మం జిల్లాల్లోనూ భారీగా తేడాలు బయటపడ్డాయి.








