- వికాసం నుంచి వైభవం పైపు ఏపీ
- స్వర్ణాంధ్ర ఐదున్నర కోట్ల ఆంధ్రుల సంకల్పం
- అవకాశాలను ఆర్ధిక శక్తిగా మారుద్దాం
- వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని గెలవాలి
- అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి, పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించిన సీఎం
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్‌ను వికాసం నుంచి వైభవం వైపు నడిపిస్తున్నామని.. సుస్థిరత నుంచి స్వర్ణాంధ్ర దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2047 స్వర్ణాంధ్ర సాధన సంకల్పం 5.5 కోట్ల మంది ఆంధ్రులు తీసుకోవాలని పిలుపునిచ్చారు. 80 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని అమరావతి రాజధానిలో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన చంద్రబాబు పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ “మనకు స్వాతంత్య్రం అంత తేలికగా ఒక్కరోజులో ఒక్కరి పోరాటంతో రాలేదు. దశాబ్దాల పోరాటం ఎందరో మహనీయుల బలిదానం, మరెందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్య్రాన్ని అందించాయి. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు చూసిన స్వప్నాన్ని సాకారం చేద్దాం. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేద్దామన్న లక్ష్యంతో పనిచేద్దాం. హక్కుల్ని, గౌరవాన్ని ఇచ్చిన దేశానికి మనమేం చేయాలన్న ఆలోచనతో పనిచేద్దాం. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్లు అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి. ఈ దేశానికి మనం ఏం ఇవ్వగలం అని ఆలోచించడమే ‘అనే నేను…’ సంకల్పం. మనం ఏ పనిచేసినా దేశ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని, సమాజహితం కోసం పనిచేయాలి. విద్యార్థి ఆవిష్కరణలతో రైతులు ప్రకృతి సాగుతో, ఉద్యోగి అంకిత భావనతో, మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించాలి. వ్యక్తిగత విజయాలన్నీ దేశ నిర్మాణంలో భాగం. ప్రధాని మోదీ ఇచ్చిన వికసిత్ భారత్ లక్ష్యం, మనం రూపోందించుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యాలు వేర్వేరు కావు. ఏపీ దేశానికి బలమైన రాష్ట్రంగా ఎదగాలి. అంతా కలిసి ఐక్యంగా స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలను సాధిద్దాం. దీనికి దృఢమైన సంకల్పం చేద్దాం”. అని ముఖ్యమంత్రి అన్నారు
ప్రతిసారీ రాష్ట్రానికి సవాళ్లే
“గత పాలనలో రాష్ట్రం ఐదేళ్ల పాటు విధ్వంసమైంది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. ఐదేళ్లు చీకటి రోజులు చూశాం. గత పాలకుల అహంకారం, అసమర్థత, అవినీతి, అరాచకంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనకబడింది. ఆర్థికంగా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. కూటమి అధికారంలోకి వచ్చాక పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నాం. గడచిన రెండేళ్లలో ఏపీని నిలబెట్టాం. తొలి సంతకం నుంచే సంక్షేమానికి, అభివృద్ధికి, సుపరిపాలనకు అసలైన అర్థం చెప్పాం. 26 నెలల్లోనే ప్రజలకు మార్పు కనిపించేలా చేశాం. విధ్వంసం నుంచి వికాసం వైపు… సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు… అనిశ్చితి నుంచి ఆత్మవిశ్వాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ ఇదే మన లక్ష్యం. దీనికోసం 10 సూత్రాలు రూపొందించుకున్నాం. అభివృద్ది వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అన్ని ప్రాంతాల అభివృద్ది, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నాం. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ చేపట్టాం. ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం, ఈ మూడు రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు ఇలా అన్నింటిలోనూ కేంద్రం సహకారం అందిస్తోంది. అన్ని వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3 శాతానికి పెరిగింది. రాష్ట్రానికి గుదిబండగా మారిన గత పాలకులు చేసిన అప్పులను రీషెడ్యూలు చేసి 370 రుణాలపై వడ్డీభారం తగ్గించ గలిగాం. ఇప్పటి వరకు రూ.8,269 కోట్లు ఆదా అయ్యేలా చర్యలు చేపట్టాం. 26 నెలల్లో రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమానికి రూ.1.34 లక్షల కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశాం. పేదల జీవన ప్రమాణాల్ని పెంచేందుకు పీ4 కార్యక్రమం చేపట్టాం. యువత గ్లోబల్ లీడర్లుగా ఎదగాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మెగా డీఎస్సీకి అడ్డంకులు సృష్టించినా 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇకపై ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేస్తాం. ఇప్పటికే 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. యువత ప్రతిభకు ఆకాశమే హద్దు వారి ఆవిష్కరణలకు ప్రపంచం జై కొట్టాలి.” అని సీఎం అన్నారు
రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ
పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెంచేందుకు 28 కొత్త పాలసీలు తీసుకొచ్చామని, ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని, వీటిలో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని తద్వారా 11 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. ఒక ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం రాష్ట్రానికి రావడం మనపై నమ్మకాన్ని పెంచిందని, రెండేళ్లలో ఎఫ్‌డిఐ ఆరున్నర రెట్లు పెరిగిందని తెలిపారు. గూగుల్ ఏఐ డాటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, దాల్మియా సిమెంట్, ఎఎం గ్రీన్ అమోనియా, హీరో, రాయల్ ఎన్ ఫీల్డ్, స్వర్ణగిరి గోల్డ్ మైన్ వంటి అనేక ప్రాజెక్టులు వచ్చాయి..95 వేల కోట్ల విలువైన బిపిసిఎల్ వంటి భారీ ప్రాజెక్టు పట్టాలెక్కుతోందని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్‌తో 36 రోజుల్లోనే ఆమ్కా డిఫెన్స్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్ ప్రభుత్వ లక్ష్యమన్న చంద్రబాబు దీని కోసం అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే 138 పార్కులకు శ్రీకారం చుట్టామని, సమాజంలో ప్రతీ వర్గానికి న్యాయం జరిగేలా చూస్తున్నామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నామని, నాణ్యమైన విద్యతో విద్యార్ధుల భవితకు పునాదులు వేస్తున్నామన్నారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంతో సంజీవని తీసుకువచ్చాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలవుతుంది. సీఎం సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకూ రూ.1,631 కోట్లు వ్యయం చేసి పేదల్ని ఆదుకున్నాం. అన్నదాత సుఖీభవ కింద ప్రతిరైతుకూ 20 వేలు అందిస్తున్నాం. పొగాకు, కోకూ, మామిడి రైతులను మద్దతు ధరతో ఆదుకున్నాం. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీతో సహకారం అందిస్తున్నాం. లక్ష కోట్లతో రాయలసీమను హార్టికల్చర్ హబ్ చేస్తున్నాం. మదనపల్లెలో త్వరలో హార్టికల్చర్ హబ్‌కు శ్రీకారం చుడతాం. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేస్తాం. ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసేలా చెరువులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తున్నామని వివరించారు.
అభివృద్ధి పథం వైపు ఏపీ
రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేదే చమ ప్రభుత్వ లక్ష్యమని, 26 నెలల్లో సాగునీటి ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.25 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందని చెప్పారు. రానున్న మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేశామన్నారు. వంశధార–నాగావళి నదుల అనుసంధానం 73 శాతం పూర్తి చేశామని, నేరడి ప్రాజెక్టును పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ముందుకు తీసుకు వెళ్తున్నాం. అనకాపల్లికి త్వరలో గోదావరి జలాలు తెస్తాం. పోలవరం ప్రాజెక్టులో 89 శాతం పనులు పూర్తి చేశాం. వచ్చే ఏడాది పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరివ్వాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధివైపు నడుపుతున్నాం. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట గ్రీన్‌ఫీల్డ్ పోర్టులను శరవేగంగా నిర్మిస్తున్నామన్నారు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం ఉప్పాడలో ఆధునిక ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామని, ఉత్తరాంధ్రలో అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.64 వేల కోట్ల రైల్వే పనులు..రూ.38 వేల కోట్ల హైవే పనులు జరుగుతున్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లు, హైవేలు, రైల్వే లేన్లతో రాష్ట్రం లాజిస్టిక్స్ కు హబ్ అవుతుంది. ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టాం. బ్లూ గ్రీన్ సిటీగా డీప్ టెక్ క్యాపిటల్ గా, కార్బన్ న్యూట్రల్, నో పోల్ సిటీ గా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా నిర్మితం అవుతుంది. స్థానిక పాలనలో ఏపీ దేశానికే ఆదర్శం. పల్లెపండుగ, అడవి తల్లి బాట కింద గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం చేపట్టాం. ఏపీని 50 శాతం గ్రీన్ కవర్ తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. చెత్తపన్ను రద్దు చేసి లెగసీ వేస్ట్ తొలగించాం. స్వచ్ఛరథం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం. విద్యుత్ రంగంలోనూ వెలుగులు తెచ్చాం. ట్రూ డౌన్ చేసి ట్రూ అప్ భారాన్ని భరిస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ లక్ష్యంలో 112 గిగావాట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం.” అని సీఎం వెల్లడించారు.
ప్రజలే ఫస్ట్ విధానం
“మహిళా సాధికారత కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా పెట్టుబడులు సాధిస్తున్నామని, రెండేళ్లలో రూ.19,390 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. బీచ్ టూరిజం, టెంపుల్, హోమ్ స్టేలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేసేందుకు మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను కేంద్రంగా మార్చామన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం రూ.30,849 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. ప్రజా భద్రతలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందని, విజిబుల్ పోలీసింగ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానం అనుసరిస్తున్నామన్నారు. అంతకు ముందు ఏపీఎస్పీ, సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీసు దళాలు, ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్ధుల కవాతు నిర్వహించి సీఎం కు గౌరవ వందనం సమర్పించాయి. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు ప్రదర్శనలో ఆకర్షణగా నిలిచాయి.








