Mahaa Daily Exclusive

  వర్షాల కోసం… ద్వారకా తిరుమలలో ఘనంగా వరుణ యాగం

Share

 

ద్వారకా తిరుమల, మహా : ద్వారకా తిరుమల శేషాచల కొండపై వెలసిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ద్వారకా తిరుమల దేవస్థానం సహకారంతో వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే మద్ది పాటి వెంకటరాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దేవస్థాన అధికారులు, బోర్డు సభ్యులు, పలువురు పెద్దలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్ది పాటి వెంకటరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలకు సమృద్ధిగా వర్షాలు కురిసి తాగు, సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్ర వరుణ యాగాన్ని నిర్వహించినట్లు తెలిపారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని, పంట నష్టంతో పాటు తాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తే పరిస్థితులు ఏర్పడవచ్చని పేర్కొన్నారు.

విపత్కర పరిస్థితుల్లో భగవంతుడిని ప్రార్థించే సంప్రదాయంలో భాగంగా ఉదయం ప్రారంభమైన వరుణ యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు తాగు, సాగునీరు పుష్కలంగా అందాలని, రిజర్వాయర్లు, చెరువులు నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారని, పవన్ కళ్యాణ్, కేంద్రం నుంచి నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. వరుణ యాగం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన దేవస్థాన అధికారులు, చైర్మన్, ఈఓ, బోర్డు సభ్యులు, పాల్గొన్న నాయకులు, పెద్దలందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Latest