• సమయం వచ్చినప్పుడు తెరుస్తా.
• నన్ను బలవంతం చేయొద్దు: తమిళనాడు సీఎం విజయ్ హెచ్చరిక.
చెన్నై, మహా.
తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మూడు శాఖల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి వ్యవహారాలకు సంబంధించిన కీలక వివరాలు తన వద్ద ఉన్నాయని వెల్లడించారు. డీఎంకే నేతలకు సంబంధించిన రెండు ఫైళ్లు ప్రస్తుతం తన టేబుల్‌పైనే ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు వాటిని తెరిచి ప్రజల ముందు వాస్తవాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
తనను బలవంతం చేసి ఆ ఫైళ్లను ఇప్పుడే తెరిచే పరిస్థితి తీసుకురావద్దని డీఎంకే నేతలను విజయ్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అధికార తమిళగ వెట్రి కళగం, ప్రతిపక్ష డీఎంకే మధ్య ఇప్పటికే కొనసాగుతున్న రాజకీయ విభేదాలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
రోడ్ల పనులపై చర్చతో మొదలైన వివాదం
డీఎంకే ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై బుధవారం తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టీవీకే, డీఎంకే సభ్యులు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి విజయ్ జోక్యం చేసుకుని డీఎంకే సభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న ఆధారాలు, ఫైళ్లపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని స్పష్టం చేశారు.
‘ప్రజలకు ఎప్పుడు ఏం చెప్పాలో నాకు తెలుసు’
శాసనసభలో విజయ్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడు, ఏం చెప్పాలో తనకు తెలుసని అన్నారు. ప్రజలు తమపై నమ్మకం ఉంచి అధికార బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ప్రతి విషయాన్ని వెంటనే రాజకీయ వివాదంగా మార్చకుండా ప్రజలకు మేలు జరిగేలా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఉప ఎన్నికల సమయంలో తాను మాట్లాడాల్సిన విషయాలను మాట్లాడతానని, అప్పటివరకు సంయమనం పాటించాలని సూచించారు. ‘‘ప్రజలకు కొంత మంచి జరగనివ్వండి’’ అంటూ డీఎంకే నేతలకు హితవు పలికారు.
మూడు శాఖలకు సంబంధించిన అవినీతి ఆరోపణలపై తన వద్ద ఉన్న వివరాలు, రెండు ఫైళ్లలో ఉన్న అంశాలు ఏమిటన్నది ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. విజయ్ ఆ ఫైళ్లను ఎప్పుడు బహిర్గతం చేస్తారు? అందులో ఎవరెవరి పేర్లు ఉన్నాయి? అనే అంశాలపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.







