- వర్గపోరుతోనే జాతీయ కార్యవర్గంలో చోటు దక్కలేదు
- బీజేపీ రాష్ట్ర నేతలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
- ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచన
హైదరాబాద్, మహా : బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ, రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజా సింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న ఈ తీవ్ర విభేదాల వల్లే ‘తెలంగాణ నేతలు మారరు’ అనే ముగింపునకు అధిష్ఠానం వచ్చి ఉంటుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో ప్రత్యేక ప్రణాళికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర నేతలంతా పాత విభేదాలను, స్వయం ప్రయోజనాలను పక్కనబెట్టి, పశ్చిమ బెంగాల్ తరహాలో ఐక్యంగా పోరాడి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంతో పోరాడితేనే భవిష్యత్తులో పార్టీ అధిష్ఠానం తగిన గుర్తింపునిచ్చి, పదవులు కేటాయిస్తుందని స్పష్టం చేశారు.








