Mahaa Daily Exclusive

  కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి..! అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చర్చకు రావాలని మంత్రి పొంగులేటికి సవాల్..:బీజేఎల్పీ నేత ఏలేటి డిమాండ్.

Share

  • కాంగ్రెస్-బీఆర్ఎస్ ‘జేవీ లూట్’పై సీబీఐ, ఈడీ విచారణ జరపాలి
  • నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • బీజేఎల్పీ నేత ఏలేటి డిమాండ్
  • ఆసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చర్చకు రావాలని మంత్రి పొంగులేటికి సవాల్
  • ఆధారాలతో నిరూపిస్తానని వెల్లడి

హైదరాబాద్, మహా : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున అవినీతి, భూదందాలు జరుగుతున్నాయని, స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన క్షమాపణే ఇందుకు నిదర్శనమని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షల కోట్ల రూపాయల విలువైన కోటి ఎకరాల భూములను 22 ఏ నిషేధిత జాబితాలో పెట్టి బేరసారాలు నడుపుతున్నారని, ఇంత పెద్ద తప్పిదం చేసి కేవలం ‘క్షమాపణ’తో సరిపెట్టుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వయంగా యాదగిరిగుట్టలోని తన 42 ఎకరాల భూమి కూడా నిషేధిత జాబితాలోకి వెళ్లిందని, దీని వెనుక కుట్ర దాగి ఉందని సీఎం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఈ భూదందాలు, నిషేధిత భూముల జాబితాపై శ్వేతపత్రం విడుదల చేయాలని, సమగ్ర విచారణ లేదా సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించాలని డిమాండ్ చేశారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ సంస్థలకు, బీఆర్ఎస్ పార్టీకి బినామీగా ఉన్న ఫీనిక్స్ కంపెనీకి మధ్య భారీ క్విడ్ ప్రో కో జరిగిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అయిన తర్వాత నానక్‌రామ్‌గూడ, పుప్పాలగూడ, నార్సింగి, కోకాపేట్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని టీజీఐఐసీ ఇండస్ట్రియల్ భూములను రాత్రికి రాత్రే రెసిడెన్షియల్ జోన్‌లుగా మార్చి ఫీనిక్స్ కంపెనీ నుంచి సుమారు రూ.15,000 కోట్ల విలువైన ఆస్తులను బదలాయించుకున్నారని డాక్యుమెంట్ల ఆధారాలతో సహా వివరించారు. అధికారంలోకి రాకముందు ఫీనిక్స్‌పై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలని, ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు వెనకడుగు వేశారని ప్రశ్నించారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ గత పాలకులతో కలిసి ‘జాయింట్ వెంచర్ లూట్’ (జీవీ లూట్) చేస్తున్నారని విమర్శించారు. ఒకవైపు మంత్రిగా ఉంటూ రూ.1,400 కోట్ల పాలమూరు-రంగారెడ్డి కాంట్రాక్ట్‌ను రూ.4,300 కోట్లకు రివైజ్ చేసుకోవడం కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా అని నిలదీశారు.

ఈ మొత్తం భూదందాలు, ఆస్తుల బదలాయింపులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. “రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద అన్ని ఆధారాలతో వేచి ఉంటాను, దమ్ము ధైర్యం ఉంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రావాలన్నారు. ఈ అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలతో ఈడీ, సీబీఐ, లోకాయుక్తలకు ఫిర్యాదు చేయడమే కాకుండా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా బహిరంగ లేఖ రాస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల పేరుతో రాష్ట్ర సమస్యలను వదిలేసి తప్పించుకు తిరుగుతున్నారని, బీజేపీ తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్-బీఆర్ఎస్ దోపిడీని అంతం చేసేవరకు పోరాడుతుందని తేల్చిచెప్పారు.

Latest