Mahaa Daily Exclusive

  కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు..! రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం..

Share

  •  రూ.13,041 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం.
  •  నాలుగు రైల్వే ప్రాజెక్టులు.
  •  బిహార్‌లో నాలుగు లైన్ల హైవేకు గ్రీన్‌సిగ్నల్‌.

ఢిల్లీ, మహా.
దేశంలో రైల్వే, రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటిలో నాలుగు రైల్వే బహుళ మార్గాల ప్రాజెక్టులు కాగా.. మరోటి బిహార్‌లో నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి సంబంధించినది.

ఆమోదం పొందిన నాలుగు రైల్వే ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు రూ.9,450 కోట్లుగా ఉంది. ఆయా మార్గాల్లో రైళ్ల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడం, సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడం ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశంగా కేంద్రం పేర్కొంది.

గూడూరు–గుమ్మిడిపూండి మార్గానికి రూ.2,229 కోట్లు

దక్షిణ భారత రైల్వే నెట్‌వర్క్‌లో కీలకమైన గూడూరు–గుమ్మిడిపూండి మార్గంలో 3, 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.2,229 కోట్లు కేటాయించారు. ఈ అదనపు లైన్లు అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగడంతో పాటు సరుకు రవాణా సామర్థ్యం పెరగనుంది.

ఇదే విధంగా ఖరగ్‌పూర్‌–భద్రక్‌ 4వ లైన్‌ నిర్మాణానికి రూ.3,352 కోట్లు, భద్రక్‌–హరిదాస్‌పూర్‌ 4వ లైన్‌కు రూ.1,583 కోట్లు, కటక్‌–పారాదీప్‌ 3, 4వ లైన్ల నిర్మాణానికి రూ.2,286 కోట్లను కేబినెట్‌ ఆమోదించింది.

1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం

కొత్త రైల్వే లైన్ల నిర్మాణం పూర్తయితే దేశంలోని కీలక పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల మధ్య సరుకు రవాణా మరింత వేగవంతం కానుంది. ఈ నాలుగు ప్రాజెక్టుల ద్వారా మొత్తం సుమారు 1.3 కోట్ల టన్నుల అదనపు సరుకు రవాణా సామర్థ్యం అందుబాటులోకి వస్తుందని అంచనా. దీంతో సరుకు రైళ్లకు మార్గాల్లో మరింత ప్రాధాన్యం కల్పించడంతో పాటు ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు కూడా అదనపు సామర్థ్యం లభించనుంది.

బిహార్‌లో రూ.3,591 కోట్ల హైవే

ఇక బిహార్‌లోని ముజఫర్‌పూర్‌–సీతామర్హి–సోన్‌బర్సా మార్గంలో నాలుగు లైన్ల హైవే నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.3,591 కోట్లు. ఈ రహదారి నిర్మాణంతో ఉత్తర బిహార్‌లో రవాణా సదుపాయాలు మెరుగుపడటంతో పాటు నేపాల్‌ సరిహద్దు ప్రాంతాలతో అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

రైల్వే మార్గాల విస్తరణ, హైవే నిర్మాణం ద్వారా ప్రయాణ సమయం తగ్గించడం, సరుకు రవాణా వేగాన్ని పెంచడం, పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతమివ్వడం, ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలు కలగనున్నాయి. దేశ ఆర్థిక వృద్ధికి అవసరమైన మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది.

Latest