Mahaa Daily Exclusive

  కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారు.. పందికొక్కుల్లా తిని మళ్ళీ పోయారు..

Share

  • సిద్దిపేటలో భగ్గుమన్న మాజీమంత్రి హరీష్ రావు
  • ఇకపై అలాంటివారికి చోటుండదు

 

సిద్దిపేట, మహా- కొందరు దొంగలు పార్టీలోకి వచ్చారని.. పందికొక్కుల్లగా తిని మళ్లీ వెళ్లిపోయారని మాజీమంత్రి హరీష్ రావు మండిపడ్డారు.

దీక్షా దివస్ సందర్భంగా సిద్దిపేట పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేసి, రంగాధంపల్లి అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణను కాపాడాలని ఆరోజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని.. ఇకపై అలాంటి వారికి పార్టీలో చోటు ఉండదని స్పష్టం చేశారు. గడ్డి పోచల్లాగా పదవులను తెలంగాణ కోసం త్యాగం చేశామన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణకు అనుకూలమని తీర్మానాలు చేసి, అవసరాలు తీరాక మాట మార్చారని దుయ్యబట్టారు. బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మాట తప్పిందన్నారు. ఉద్యోగ గర్జన సన్నాహక సమావేశంలో ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ సంకల్పం తీసుకున్నారని.. కరీంనగర్ నుంచి దీక్ష కోసం కేసీఆర్ వస్తుంటే ఆయన్ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారన్నారు. కేసీఆర్‌కు మద్దతుగా సిద్దిపేటలో దీక్ష శిబిరంలో దీక్ష చేస్తున్న తమపై గొర్రెల మందపై తోడేళ్ళు పడ్డట్టు పోలీసులు అరెస్టులు చేశారని మండిపడ్డారు. ఈ ప్రజావ్యతిరేక సర్కారును గద్దె దించేవరకు రైతుల పక్షాన, యువకుల పక్షాన, బాధితుల పక్షాన పోరాటానికి సంకల్పం తీసుకుందాం’’ అంటూ హరీష్‌ రావు పిలుపునిచ్చారు.