కేంద్ర మంత్రి పదవికి ఎల్. మురుగన్ రాజీనామా
* రాజ్యసభ సభ్యత్వానికీ గుడ్‌బై.
* తమిళనాడు రాజకీయాలపై దృష్టి
న్యూఢిల్లీ, మహా.
కేంద్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన ఆయన.. కేంద్ర ప్రభుత్వ బాధ్యతల నుంచి తనను తప్పించాలని, రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునేందుకు అనుమతించాలని కోరారు. తమిళనాడులో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు 2029 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గ్రామాలు, వీధుల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని, ప్రజలతో నేరుగా మమేకమై పార్టీ విస్తరణకు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో మురుగన్ రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రిగా కొనసాగడం కంటే తమిళనాడులో పార్టీ సంస్థాగత నిర్మాణానికి పూర్తిస్థాయి సమయం కేటాయించాలన్న ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి వెళ్లి ప్రజలను కలవడం, పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేయడం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో భాజపా ఉనికిని విస్తరించడం తన ముందున్న లక్ష్యాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ మురుగన్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. రోజువారీ కూలీ పనులు చేసుకునే తల్లిదండ్రుల కుమారుడిగా ప్రారంభమైన తన జీవితం.. ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రివర్గంలో పనిచేసే స్థాయికి చేరడం గొప్ప గౌరవమని పేర్కొన్నారు. దేశానికి, తమిళనాడుకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంలో తనకు అప్పగించిన బాధ్యతల ద్వారా దేశ ప్రజలను మరింతగా అర్థం చేసుకునే అవకాశం లభించిందని వివరించారు. ఇప్పుడు పార్టీ కార్యకర్తల మధ్యకు తిరిగి వెళ్లి సంస్థాగత నిర్మాణానికి అంకితమవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. దేశానికి ప్రాధాన్యం, పార్టీకి తదుపరి స్థానం, వ్యక్తిగత ప్రయోజనాలకు చివరి స్థానం అనే సూత్రంతో ముందుకు సాగుతానని తన సందేశంలో పేర్కొన్నారు.
తమిళనాడుకు చెందిన ఎల్. మురుగన్ మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2021లో తొలిసారి పెద్దల సభకు ఎన్నికైన ఆయన.. 2024 ఏప్రిల్‌లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రెండోసారి ఎన్నిక కావడంతో ఆయన పదవీకాలం 2030 వరకు కొనసాగాల్సి ఉంది. అయితే పదవీకాలం ముగియడానికి ముందే సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి ఒకేసారి రాజీనామా చేయడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై తన దృష్టిని కేంద్రీకరించనున్నట్లు స్పష్టం చేశారు.







