నీట్ పేపర్ లీకేజీలకు చెక్.
* వ్యవస్థాత్మక మార్పులే శరణ్యం: నందన్ నిలేకని
న్యూఢిల్లీ, మహా .
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ లాంటి ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని కీలక సూచనలు చేశారు. ఒకే ఒక్క ప్రశ్నపత్రంపై ఆధారపడే పాత పరీక్షా విధానం వల్లే పేపర్ లీకేజీ మాఫియా పుట్టుకొస్తోందని ఆయన విశ్లేషించారు. ముందుగానే ముద్రించి సిద్ధంగా ఉంచే ఒకే ప్రశ్నపత్రం విధానానికి స్వస్తి పలకాలని, లేదంటే దాన్ని లీక్ చేసి అమ్ముకునే ఆర్థిక కుంభకోణాలకు ఎప్పటికీ ఆస్కారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా పత్రాలు లీకైన తర్వాత తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడం కంటే, పరీక్షా విధానంలో తక్షణమే సమూల మార్పులు తేవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
పరీక్షలకు ముందు ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించే బదులు, భారీ సంఖ్యలో ప్రశ్నలతో కూడిన ‘క్వశ్చన్ బ్యాంక్’ను సిద్ధం చేయాలని నిలేకని ప్రతిపాదించారు. పరీక్ష ప్రారంభానికి కేవలం కొన్ని నిమిషాల ముందు మాత్రమే ఆటోమేటెడ్ విధానంలో నూతన ప్రశ్నపత్రాన్ని సృష్టించడం ద్వారా పేపర్ లీక్ ముఠాల ఆటకట్టించవచ్చని, తద్వారా వారికి వచ్చే ఆర్థిక ప్రయోజనం పూర్తిగా దెబ్బతింటుందని వివరించారు. దీనితో పాటు పాత పెన్ అండ్ పేపర్ విధానం నుంచి పూర్తిగా కంప్యూటర్ ఆధారిత డిజిటల్ (సీబీటీ) పరీక్షల వైపు అడుగులు వేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా పరీక్ష రాసేందుకు వీలుగా కనీసం 1.5 లక్షల డిజిటల్ పరీక్షా కేంద్రాల మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.
పరీక్షా విధానంలో మూలాల నుంచి వ్యవస్థాత్మకమైన మార్పులు తీసుకురావడం ద్వారానే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలమని నిలేకని అభిప్రాయపడ్డారు. ఈ లీకేజీల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ త్వరలోనే తగిన కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని, స్వయంగా ప్రధానమంత్రి కూడా ఈ నూతన మార్పుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.







