ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు.
* కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజం.
న్యూఢిల్లీ, మహా.
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసంలో విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఓట్ల తొలగింపు, ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ తదితర అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. నిరసనలు తెలిపే హక్కును కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని, ప్రజలు తమ గొంతుకను వినిపించే జంతర్ మంతర్ వేదికను కూడా లాగేసుకుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజాస్వామ్య భావాలను వ్యక్తపరిచేందుకు ఇక జంతర్ మంతర్‌ను ఏవిధంగానూ ఉపయోగించలేని పరిస్థితికి కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు.
ఇటీవలే జంతర్ మంతర్ వద్ద తాము చేపట్టిన ఆందోళనలు విజయవంతం కావడంతోనే కేంద్రం కక్షపూరితంగా ఈ నిర్ణయం తీసుకుందని రాహుల్ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఉన్నారని, ఇప్పుడు ఆ ముగ్గురి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని వ్యాఖ్యానించారు. నిరసనలు తెలిపే వేదికల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థను నాశనం చేసి పారిపోతామంటే కుదరదని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు ఉమ్మడి పోరాటం కొనసాగిస్తామని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు.







