Mahaa Daily Exclusive

  ఐఎస్‌ఎస్‌కు విజయవంతంగా దూసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ‘డ్రాగన్’ కార్గో నౌక….

Share

ఢిల్లీ, మహా.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్‌ఎస్) పరిశోధనలు సాగిస్తున్న వ్యోమగాముల అవసరాల నిమిత్తం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) చేపట్టిన ప్రతిష్ఠాత్మక కార్గో మిషన్ విజయవంతంగా ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం సరిగ్గా 4:03 గంటలకు ‘స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9’ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ద్వారా మానవ రహిత ‘డ్రాగన్’ కార్గో అంతరిక్ష నౌకను శాస్త్రవేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఈ కార్గో నౌకలో అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాముల కోసం 2,800 కేజీలకు పైగా నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలు, నూతన పరికరాలతో పాటు అత్యంత కీలకమైన శాస్త్రీయ ప్రయోగ సామగ్రిని పంపినట్లు నాసా వెల్లడించింది. నాసా భాగస్వామ్యంతో స్పేస్‌ఎక్స్ సంస్థ చేపట్టిన 35వ వాణిజ్య కార్గో డెలివరీ మిషన్ ఇది. సుమారు 52 గంటల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన అనంతరం, ఈ డ్రాగన్ నౌక గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో దానంతట అదే స్వయంచాలితంగా (ఆటోమేటెడ్ డాకింగ్) అనుసంధానం కానుంది.
వ్యోమగాముల ఆహార నిల్వలతో పాటు అనేక అధునాతన శాస్త్రీయ ప్రయోగాలకు సంబంధించిన సామగ్రిని ఈ నౌక మోసుకెళ్లింది. ముఖ్యంగా ఐఎస్‌ఎస్‌లో విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు అవసరమైన సరికొత్త సోలార్ అర్రే ప్యానెల్స్‌ను ఇందులో పంపారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడేలా.. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులపై లోతైన అధ్యయనం కోసం ప్రయోగశాలలో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మానవ మెదడు కణజాల నమూనాలు (హ్యూమన్ బ్రెయిన్ టిష్యూ మోడల్స్) కూడా వీటిలో ఉన్నాయి. అంతరిక్షంలోని గురుత్వాకర్షణ రహిత వాతావరణంలో కృత్రిమ రెటీనా, గుండె కణజాలం (హార్ట్ టిష్యూ) 3డీ నమూనాల తయారీకి సంబంధించిన ప్రయోగ సామాగ్రిని కూడా పంపించారు. నవంబర్ రెండో వారం వరకు ఐఎస్‌ఎస్‌తోనే అనుసంధానమై ఉండే ఈ డ్రాగన్ నౌక, అక్కడ పూర్తయిన ప్రయోగాల వివరాలు, శాస్త్రీయ నమూనాలను సేకరించుకుని తిరిగి భూమికి చేరనుంది.