Mahaa Daily Exclusive

  పద్మ అవార్డులతో సీఈసీలకు లంచం ఇచ్చింది కాంగ్రెస్సే…కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.

Share

న్యూఢిల్లీ, మహా .
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి చేస్తున్న డిమాండ్లపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలే పద్మ అవార్డులు, రాజకీయ పదవుల రూపంలో ప్రధాన ఎన్నికల కమిషనర్లకు లంచాలు ఇచ్చి లబ్ధి పొందాయని సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఈసీ వ్యవహారంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిని, బాధ్యతారాహిత్యాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఎన్నికల కమిషనర్లందరూ పూర్తి స్వతంత్రతతో, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం చేశారు.
గత కాంగ్రెస్ పాలనలో జరిగిన ఉదంతాలను పీయూష్ గోయల్ ఈ సందర్భంగా ఎత్తిచూపారు. పదవీ విరమణ చేసిన ఎన్నికల కమిషనర్లకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపిందని, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అడ్వాణీపై పోటీకి మాజీ సీఈసీ టి.ఎన్. శేషన్‌ను రంగంలోకి దించిన చరిత్ర వారిదని గుర్తుచేశారు. మరో మాజీ సీఈసీ ఎం.ఎస్. గిల్‌కు పద్మవిభూషణ్ పురస్కారంతో పాటు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టి ప్రయోజనం చేకూర్చారని ధ్వజమెత్తారు. అలాగే 1986లో మాజీ సీఈసీ ఆర్.కె. త్రివేదిని గుజరాత్ గవర్నర్‌గా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు.
గతంలో ఎవరితోనూ సంప్రదింపులు, ముందస్తు చర్చలు లేకుండా ఏకపక్షంగా సీఈసీలను నియమించిన కాంగ్రెస్‌కు నేడు విమర్శించే నైతిక హక్కు లేదని గోయల్ పేర్కొన్నారు. నియామకాల్లో పారదర్శకత కోసమే మోదీ ప్రభుత్వం 2023లో సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియలో లోక్‌సభ ప్రతిపక్ష నేతకు సైతం సభ్యుడిగా కీలక స్థానం కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఆయన తేల్చిచెప్పారు.