ఉపాధి హామ ఉద్యోగులకు దసరా కానుక.
* గ్రాట్యుటీ మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఎఫ్‌టీఈ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ కానుకను అందించింది. సుమారు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి పోరాడుతున్న సుమారు 3,800 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో తమ నిరీక్షణకు తెరపడిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల సర్వీసు, రిటైర్మెంట్ నిబంధనల ప్రకారం.. ఈ నిర్ణయంతో వారికి కనీసం రూ. 4 లక్షల గ్రాట్యుటీతో పాటు, పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు రూ. 10 లక్షల వరకు ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో ఈ గ్రాట్యుటీ కొండంత ఆర్థిక భరోసాను ఇవ్వనుంది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్‌ను నెరవేర్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్కకు ఎఫ్‌టీఈ ఉద్యోగుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
ఉద్యోగుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమని ఆమె తెలిపారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ, ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు దశలవారీగా పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. తాజా నిర్ణయం ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని నింపడంతో పాటు, భవిష్యత్తులో వారి కుటుంబాలకు సామాజిక, ఆర్థిక భద్రతను చేకూరుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.








