- త్వరలో చేరిక.. సిద్దంగా ఉన్నానంటూ సంకేతాలు
- ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు నేపథ్యంలో భేటీ ప్రాధాన్యత
- కుటుంబంలో వేడుకకు ఆహ్వానించేందుకేనన్న తలసాని
- అదే బాటలో.. మరో నలుగురు
- పోచారంతో పలువురు ఎమ్మెల్యేల మంతనాలు
- – గ్రేటర్ హైదరాబాద్ నుండే.. టచ్ లో ఏడుగురు
హైదరాబాద్, మహా
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఉదయం బంజారాహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి తలసాని భేటీ అయ్యారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. పెళ్లి పత్రిక అందించి, చిరునవ్వులతో చేతులు కలిపారు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలో తలసాని కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన సంకేతాలను భేటీ సందర్భంగా ఇచ్చారని సమాచారం. తాజాగా తలసాని కుటుంబసభ్యులకు చెందిన ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రజలు వ్యతిరేకించిన నేపథ్యంలో ప్రభుత్వం రద్దు చేసింది. గొర్రెల కొనుగోళ్ళలో అక్రమాలకు సంబంధించి కూడా విచారణ జరుగుతోంది.
గొర్రెల పంపిణీలో భారీ కుంభకోణం
చనిపోయిన వారికీ గొర్రెలను పంపిణీ చేసినట్లు నమోదు చేయడంతో పాటు.. నకిలీ రవాణా ఇన్వాయిస్‌లతో 68 కోట్లు స్వాహా చేశారని కాగ్ నివేదిక తేల్చింది. గొర్రెలకు నకిలీ ట్యాగ్‌లతో మరో 92 కోట్ల అవినీతి జరిగిందని, గొర్రెల పంపిణీలో 253.93 కోట్ల వినియోగంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గొర్రెల పంపిణీలో మొత్తం రూ.700కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎసిబి తేల్చింది. తలసాని మాజీ ఓఎస్డీతో పాటు పలువురు అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు.
గ్రేటర్ లో మూకుమ్మడిగా..
గ్రేటర్ కు చెందిన పలువురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరికలకు సుముఖత వ్యక్తం చేసినా ఇంకా ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మూకుమ్మడిగా ఒకేసారి ఈ చేరికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీమంత్రి తలసాని తో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా సంప్రదింపుల్లో ఉన్నారు. మొత్తం గ్రేటర్ కు సంబంధించి 7 గురు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
…..








