- తెలంగాణకు వర్ష సూచన
- 5 రోజుల పాటు రాష్ట్రంలో వానలు
- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
- తగ్గనున్న పగటి ఉష్ణోగ్రతలు
హైదరాబాద్, మహా : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వర్షం హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ దశలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయని.. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, ఇతర వాతావరణ పరిణామాలతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణతో పాటు మధ్య తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చన్నారు. మేఘావృతమైన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉండగా.. వర్షాల మధ్య విరామాల్లో కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కొనసాగవచ్చునని చెప్పారు.
గురువారం ఉదయం 8.30 గంటల నుంచి అక్టోబరు 17వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ సమయంలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి ప్రాంతాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాలు పడవచ్చని అంచనా. అక్టోబరు 17వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ ఉదయం 8.30 గంటల వరకు కొన్ని జిల్లాల్లో వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ సహా ఇతర ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.
అక్టోబరు 18వ తేదీ నుంచి 20వ తేదీ ఉదయం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో కూడా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల వారీగా వర్ష తీవ్రతలో మార్పులు ఉండవచ్చునని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు కోతకు వచ్చిన పంటలు, ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. వ్యవసాయ మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన ధాన్యాన్ని అవసరమైన కవర్లతో కప్పి భద్రపరచాలని అంటున్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా చేసుకోవాలని.. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని అంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని సూచిస్తున్నారు.








