Mahaa Daily Exclusive

  అద్వాణీకి అస్వస్థత….

Share

  • అద్వాణీకి అస్వస్థత..
  • ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స
  • ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
  • అక్టోబర్‌ 7న నివాసంలో మోదీ పరామర్శ..
  • తొమ్మిది రోజులకే ఆసుపత్రిలో చేరిన బీజేపీ అగ్రనేత

న్యూఢిల్లీ, మహా : బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వాణీ (98) ఛాతీ నొప్పితో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం సాయంత్రం ఆయనను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం పల్మనాలజీ విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

ఈ ఏడాది మేలోనూ ఆసుపత్రిలో చేరిక.

వయో సంబంధిత ఆరోగ్య సమస్యల కారణంగా అద్వాణీ ఈ ఏడాది మేలోనూ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కొన్ని రోజులకే డిశ్చార్జి అయ్యారు. 2024లోనూ ఆయన పలుమార్లు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అదే ఏడాది డిసెంబరులో వైద్య పర్యవేక్షణలో ఉంచిన అనంతరం డిసెంబర్‌ 25న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. తాజా అనారోగ్యానికి సంబంధించి మరిన్ని వైద్య వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

తొమ్మిది రోజుల క్రితమే అడ్వాణీని కలిసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్‌ 7న ఢిల్లీలోని అద్వాణీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్వాణీ ఆశీస్సులు తీసుకున్నారు. 2001 అక్టోబర్‌ 7న మోదీ తొలిసారిగా గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అద్వాణీ దశాబ్దాల ప్రజాసేవ దేశంపై చెరగని ముద్ర వేసిందని మోదీ అప్పట్లో పేర్కొన్నారు.

బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర

1927లో అప్పటి బ్రిటిష్‌ ఇండియాలోని కరాచీలో జన్మించిన అద్వాణీ.. దేశ విభజన సమయంలో 1947లో భారత్‌కు వలస వచ్చారు. బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన ఆయన మూడుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానిగా పనిచేశారు. ప్రజాసేవకు గుర్తింపుగా 2024 మార్చిలో ఆయనకు భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానం చేశారు.