Mahaa Daily Exclusive

  విమాన ప్రయాణికులకు అలర్ట్

Share

  • సౌదీ అరేబియాకు విమాన సేవల నిలిపివేత

మహా : పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు విమాన ప్రయాణాలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు కీలక సమాచారం వెల్లడించాయి. భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తమ విమాన సర్వీసుల రద్దును అక్టోబర్ 24, 2026 వరకు పొడిగించాయి. ఇప్పటికే ఇండిగో, ఆకాశ ఎయిర్ కూడా సౌదీ అరేబియాలోని పలు నగరాలకు విమానాల రద్దును ప్రకటించడంతో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మరోసారి పరిశీలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

శనివారం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జెడ్డా, రియాద్, దమ్మామ్ నగరాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను అక్టోబర్ 24 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో వెల్లడించింది. ఈ సమయంలో ప్రయాణికులకు సాధ్యమైనంత ఎక్కువ వెసులుబాటు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ప్రాంతీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.

అంతకుముందు ఎయిర్ ఇండియా సౌదీ అరేబియాకు విమానాలను అక్టోబర్ 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తొలుత అక్టోబర్ 17 వరకు సర్వీసులను నిలిపివేసింది. తాజాగా పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో ఈ గడువును అక్టోబర్ 24 వరకు పొడిగించాయి.