- సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు
- మద్రాసు హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై, మహా : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రజలు సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సినిమా పాటలకు నృత్యాలు చేయడంపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఉత్సవాల నిర్వహణకు పోలీసులు విధించిన నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
నవరాత్రి ఉత్సవాల పేరుతో సినిమా పాటలకు నృత్యాలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ భారత్ హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి దిల్లీ బాబు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నవరాత్రి పండుగను జరుపుకుంటారని, ఈ సందర్భంగా ముగ్గురు దేవతల కథలను పాటలు, నృత్యాల ద్వారా తర్వాతి తరాలకు అందిస్తారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. కానీ ఇప్పుడు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చెన్నైలోని ప్రైవేటు హోటళ్లలో నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. చెన్నైలోని రాయపేటలో ఉన్న ఎక్స్ప్రెస్ అవెన్యూ మాల్లో గతేడాది గుజరాత్కు చెందిన ఓ సంస్థ దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సినిమా పాటలతో నృత్య కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. ఈ ఏడాది కూడా అదే తరహా కార్యక్రమానికి అనుమతి లభించిందని పిటిషన్లో పేర్కొన్నారు.
నవరాత్రి వేడుకల్లో ఇంగ్లిష్ హిప్హాప్, బాలీవుడ్ పాటలు వినిపిస్తున్నాయని, కార్యక్రమానికి వచ్చే యువత మద్యం తీసుకురావడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. దీంతో ఉత్సవాల పవిత్రతకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై అక్టోబర్ 12న తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు.
హైకోర్టులో వాదనలు
పిటిషనర్ తరఫున న్యాయవాది రిచర్డ్సన్ విల్సన్ వాదనలు వినిపించారు. నవరాత్రి వేడుకల్లో గర్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంలో భాగమేనని, అయితే ఎలాంటి పాటలు వినిపిస్తున్నారు, మద్యం అందిస్తున్నారా వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి పోలీసులు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని అభ్యర్థించారు. వాదనలు విన్న జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్, నవరాత్రి వేడుకల్లో సినిమా పాటలకు నృత్యాలు చేయడం సరైనది కాదని వ్యాఖ్యానించారు. ఉత్సవాల నిర్వహణకు పోలీసులు విధించిన షరతులను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.







