- హెచ్ 1 -బి వీసా వర్క్ పర్మిట్లపై కఠిన ఆంక్షలు!
న్యూయార్క్, మహా : అమెరికాలో స్థిరపడిన విదేశీ ఉద్యోగులు, ముఖ్యంగా భారతీయులకు యూఎస్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వివిధ కేటగిరీల వలసదారులకు ఇప్పటివరకు వర్తించిన వర్క్ పర్మిట్ల 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు నిబంధనను అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం రద్దు చేసింది. జో బైడెన్ హయాంలో బ్యాక్లాగ్ల దృష్ట్యా ప్రవేశపెట్టిన ఈ సదుపాయాన్ని డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సరికొత్త తుది నిబంధన ద్వారా అధికారికంగా తొలగించింది. తాజా నిర్ణయంతో రెన్యువల్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్న సమయంలో ఉద్యోగం చేసే వెసులుబాటు ఇకపై ఉండదు. ప్రస్తుత అనుమతి గడువు ముగిసి కొత్త కార్డు చేతికి రాకపోతే తప్పనిసరిగా ఉద్యోగం నిలిపివేయాల్సి ఉంటుంది. ఈ మార్పు భారతీయులతో కూడిన హెచ్-1బీ ఉద్యోగుల కుటుంబాలపై పిడుగులా పడింది.
హెచ్-4 వీసాదారులపై తీవ్ర ప్రభావం
ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ) ఆధారంగా అమెరికాలో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది హెచ్-4 జీవిత భాగస్వాములకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. స్టేటస్ మార్పు కోరేవారు, శరణార్థులు కూడా ఈ ప్రభావానికి గురికానున్నారు. అయితే స్టెమ్ కోర్సులు పూర్తి చేసిన ఎఫ్-1 విద్యార్థులకు సకాలంలో దరఖాస్తు చేసుకుంటే లభించే 180 రోజుల పొడిగింపు నిబంధన యథాతథంగా కొనసాగనుంది. ఎల్, ఈ వీసాదారుల భాగస్వాములు తమ ఇమిగ్రేషన్ హోదా ఆధారంగా పని చేసుకునే హక్కును నిలుపుకుంటారు.








