- నంబర్ ప్లేట్ స్థానంలో యూత్ ప్రెసిడెంట్ బోర్డు
- వరంగల్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం
వరంగల్, మహా ;
వరంగల్ నగరంలో ట్రాఫిక్ రూల్స్ కేవలం సామాన్యులకే వర్తిస్తాయా? నేతల వాహనాలకు వర్తించవా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతల వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుండా, నంబర్ ప్లేట్ స్థానంలో జిల్లా యూత్ ప్రెసిడెంట్ బోర్డు లు, జిడబ్ల్యూఎం సి కార్పోరేటర్ అనే బోర్డులు పెట్టుకుని నగరంలో హల్ చల్ చేస్తున్నా వరంగల్ ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ నగరంలో ట్రాఫిక్ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతోంది. సామాన్య వాహనదారుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చలాన్లు విధించడం లేదా చిన్న తప్పు చేసినా వేలల్లో జరిమానాలు విధించే ట్రాఫిక్ పోలీసులు, అధికార పార్టీ నేతల వాహనాల విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నగరంలో ఓ కాంగ్రెస్ యూత్ నేతకు చెందిన ఇన్నోవా క్రిస్టా వాహనం నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతోంది. ముందు, వెనుక నంబర్ ప్లేట్ ఉండాల్సిన చోట జిల్లా యూత్ ప్రెసిడెంట్ అనే బోర్డు దర్జాగా అమర్చుకున్నాడు. వెలుస్తోంది. ఎలాంటి నంబర్ లేకుండానే నగరంలోని ప్రధాన రహదారుల్లో ఈ వాహనం హల్ చల్ చేస్తోంది.
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం తీవ్ర నేరం. నంబర్ ప్లేట్ స్థానంలో హోదా బోర్డులు పెట్టడం చట్ట విరుద్ధం. అలాంటి వాహనాన్ని వెంటనే సీజ్ చేయాలి. కానీ వరంగల్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఈ వాహనాన్ని పట్టుకోవడం లేదు. దీంతో నేతల వాహనాలకు ట్రాఫిక్ రూల్స్ వర్తించవా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
సామాన్యుడి బైక్ కు నంబర్ ప్లేట్ సరిగా లేకపోతేనే కేసు పెట్టే పోలీసులు, ఇన్నోవా క్రిస్టా లాంటి ఖరీదైన కారుకు నంబర్ ప్లేట్ లేకపోయినా ఎందుకు వదిలేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఈ నేత ఇలా చెలరేగి పోతున్నారని, ట్రాఫిక్ పోలీసులు కూడా అధికార పార్టీ నేతల వాహనాలు కదా అని భయ పడుతున్నారేమో అని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది ఒక వాహనానికే పరిమితం కాదు. నగరంలో చాలా మంది నేతల వాహనాలు ఇదే తరహాలో నంబర్ ప్లేట్లు లేకుండా, ప్రెసిడెంట్, కార్పొరేటర్, చైర్మన్, అధ్యక్షులు అనే బోర్డులతో తిరుగుతున్నాయి. ఇలాంటి వాహనాలతో ప్రమాదం జరిగితే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది? అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా వరంగల్ సీపీ, ట్రాఫిక్ డీసీపీ స్పందించి, నంబర్ ప్లేట్ లేని వాహనాల పై కఠిన చర్యలు తీసుకోవాలని, నేతలు ఎవరైనా రూల్స్ అందరికీ ఒకటే అని నిరూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








