- ఎస్సీ, ఎస్టీ కేసులో తప్పిదాల పై జర్నలిస్టుల ఫిర్యాదు
- సమగ్ర విచారణ జరిపించాలని వరంగల్ సీపీ కి ఫిర్యాదు
హనుమకొండ, మహా ;
ఎస్సీ,ఎస్టీ కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 471/2025) విచారణలో జరిగిన తప్పిదాల పై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేతకు జర్నలిస్టులు శనివారం ఫిర్యాదు చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్ 471/2025 కింద నమోదైన కేసులో తాము సాక్షులుగా ఉన్నామని జర్నలిస్టులు గడ్డం కేశవమూర్తి, తోట సుధాకర్, పెండెం వేణుమాధవ్, మేరుగుల రాజేంద్రప్రసాద్ తెలిపారు. విచారణ అధికారిగా ఉన్న హనుమకొండ ఏసీపీ నరసింహారావు తో పాటు ఏ ఒక్క పోలీసు అధికారి కూడా తమను విచారణకు పిలవలేదని వారు పేర్కొన్నారు. తమ నుంచి ఎలాంటి వాంగ్మూలాలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినప్పటికీ, 2025 ఆగస్టు 15న ఏసీపీ సమక్షంలో తాము వాంగ్మూలాలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించి వాటిని న్యాయస్థానానికి సమర్పించి కేసును మూసివేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. ఇదే విషయం పై విచారణాధికారిగా ఉన్న సంబంధిత ఏసీపీని సంప్రదించడంతో కేసు మూసివేశామని తెలపడంతో ఖంగు తిన్నామని తెలిపారు. తమకు ఎలాంటి సమాచారం లేకుండానే కేసును ఎలా మూసివేస్తారని ప్రశ్నించడంతో ఏమైనా ఉంటే కోర్టుకు వెళ్లి చూసుకోవాలని సమాధానమిచ్చారని పేర్కొన్నారు. తమను విచారించకుండానే తమ పేర్లతో వాంగ్మూలాలు ఎలా నమోదు చేశారు? వాటిని ఏ ఆధారాలతో న్యాయస్థానానికి సమర్పించారు? అనే అంశాల పై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సంబంధిత పోలీసు రికార్డులు, వాంగ్మూలాలు, న్యాయస్థానానికి సమర్పించిన పత్రాలను పునః పరిశీలించి, విచారణలో బాధ్యులుగా తేలిన అధికారుల పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. కోర్టు ద్వారా తీసుకున్న పత్రాలన్నింటినీ సిపీకి అందించారు. ఫిర్యాదును, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ శ్వేత ఐపీఎస్ సానుకూలంగా స్పందించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి విచారణ జరిపిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదుదారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించిన కేసులో బాధితుడు కంకనాల సంతోష్ మరో ఫిర్యాదులో తనకు జరిగిన అన్యాయం పై సీపీకి వివరించారు. విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. సీపీ ని కలిసిన వారిలో జర్నలిస్ట్ వెల్ఫేర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వల్లాల వెంకటరమణ, టీయూడబ్ల్యూజె హన్మకొండ జిల్లా అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి, ప్రధాన కార్యదర్శి ఊటుకూరు సాయిరాం, కోశాధికారి పొడిచెట్టి విష్ణువర్ధన్ ,
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, టియుడబ్ల్యూజే రాష్ట్ర బాధ్యులు పి .వేణుమాధవ్, తోట సుధాకర్, బోళ్ల అమర్, మేరుగుల రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








