- తొక్కిసలాటలో 17 మంది దుర్మరణం
మహా : ఉత్తర కోల్కతాలోని అత్యంత ప్రసిద్ధ చోర్బాగన్ సార్వజనీన్ దుర్గాపూజా పండల్ వద్ద శనివారం రాత్రి జరిగిన తీవ్ర తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ విషాద సంఘటనలో కనీసం 17 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తుంది. అమ్మవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు పోటెత్తిన సమయంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షం వల్ల ప్రజలు తలదాచుకునేందుకు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో తోపులాట జరిగి కిందపడిపోయిన వారిని వెనుక నుంచి దూసుకొచ్చిన రద్దీ తొక్కుకుంటూ వెళ్లడంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. కింద పడిపోయిన వారు ఊపిరాడక, బలమైన గాయాలు కావడంతో పలువురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, క్షతగాత్రులను వెంటనే కలకత్తా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి మెరుగైన అత్యవసర చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ , భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా చోర్బాగన్ పండల్ను అధికారులు పూర్తిగా మూసివేశారు. పండుగ పూట ఇంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో నగరవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి.







