- ఛైర్మన్‌గా భట్టి విక్రమార్క
- కమిటీలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, సీతక్క, తుమ్మల
హైదరాబాద్, మహా : ఎల్‌నినో పరిస్థితిని సమీక్షిస్తూ తగిన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటుచేసింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సభ్యులుగా కేబినెట్ సబ్‌కమిటీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారు, మాజీ సీఎస్ రామకృష్ణారావు ప్రత్యేక ఆహ్వానితుడిగా కేబినెట్ సబ్‌కమిటీని సమన్వయం చేస్తూ అవసరమైన వివరాలు అందిస్తారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ కన్వీనర్‌గా ఉంటారని వివరించింది.
ఇవీ కేబినెట్ సబ్‌కమిటీ విధులు
ఇటీవల మంత్రులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు మంత్రివర్గ ఉపసంఘం ఎల్‌నినో పరిస్థితులు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, సూచనలు ఇస్తుందని ఉత్తర్వుల్లో సర్కార్ పేర్కొంది. రానున్న రోజుల్లో సాగు, తాగునీరు, విద్యుత్, పశుగ్రాసం కొరత, రిజర్వాయర్లు, నిధుల నిర్వహణ కీలకం కానున్న తరుణంలో ఆయా శాఖల మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ప్రజలు చేయాల్సిన పనులు, కేంద్ర సహకారం వంటి అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చిస్తుందని వివరించింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికల రూపకల్పనలో నిమగ్నమైంది. వర్షాభావం కారణంగా సుమారు 11.18 లక్షల ఎకరాల్లోని పంటలు చేతికందే అవకాశం లేదనే అంచనాల నేపథ్యంలో వివిధ శాఖల పరిధిలోని పరిస్థితుల నివేదికలను సేకరించి, ప్రత్యామ్నాయ చర్యలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇటీవల జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలోనూ వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో సాధారణం కన్నా 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు అంచనా వేశారు. సుమారు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు కూడా సర్కారు అంచనా వేస్తోంది. కరవు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయాన్ని అందించాలని ఇప్పటికే శాసనసభలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రూ.20 వేల కోట్ల స్పెషల్ ప్యాకేజీని కేటాయించాలని కూడా కోరింది. ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ఇప్పటికే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాజాగా కేబినెట్ నిర్ణయం మేరకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు చేసేందుకు డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలో సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది.








