Mahaa Daily Exclusive

  పునర్విభజన బిల్లుపై చర్చకు కాంగ్రెస్‌ తేదీలు ఇవ్వలేదు.

Share

  •  డీఎంకే, ఎస్పీ, వైఎస్సార్‌సీపీ సహా పలు పార్టీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడి.
  •  ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు లేఖ.

న్యూఢిల్లీ, మహా:

పరిధుల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చించేందుకు కాంగ్రెస్‌ పార్టీ పదేపదే కోరినప్పటికీ, సమావేశానికి తేదీలను ఇవ్వలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు అక్టోబర్‌ 19న రాసిన లేఖలో ఆయన ఈ విషయాలను ప్రస్తావించారు. కాంగ్రెస్‌తో చర్చలకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాకపోవడంతో ఇతర రాజకీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. పరిధుల పునర్విభజన రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంటులో చర్చించేందుకు ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ అక్టోబర్‌ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఖర్గే లేఖ రాశారు. దీనిపై స్పందించిన రిజిజు, కాంగ్రెస్‌ పార్టీతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నించిందని పేర్కొన్నారు. మార్చి 16, మార్చి 26, ఏప్రిల్‌ 12 తేదీల్లో ఖర్గేకు లేఖలు రాసినట్లు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీతోనూ వ్యక్తిగతంగా చర్చించి సహకారం కోరినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి చర్చలకు తేదీలు ఖరారు కాకపోవడంతో డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, శివసేన (ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే), ఎంఐఎం, బిజూ జనతాదళ్‌ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి లేఖలో పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లుపై చర్చకు అవకాశం కల్పించడం, విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించడం ఈ సంప్రదింపుల లక్ష్యమని వివరించారు.

పార్లమెంటు సమావేశాలు వాయిదా పడిన తర్వాత 64 రోజులు గడిచినా తిరిగి సమావేశం కాలేదన్న ఖర్గే వ్యాఖ్యపైనా రిజిజు స్పందించారు. సభను తిరిగి సమావేశపరిచేందుకు నిర్దిష్ట కాలపరిమితిని రాజ్యాంగం తప్పనిసరిగా నిర్దేశించలేదని తెలిపారు. గతంలోనూ పార్లమెంటు సమావేశాల మధ్య ఎక్కువ విరామాలు ఉన్న సందర్భాలను లేఖలో ప్రస్తావించారు.

ప్రధాన జాతీయ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు చర్చల్లో పాల్గొనడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రిజిజు పేర్కొన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పటికే చేపట్టిన సంప్రదింపులను పరిగణనలోకి తీసుకుని, అదే డిమాండ్‌ను పునరావృతం చేయకుండా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా సహకరించాలని కోరారు. భవిష్యత్తులో కీలకమైన బిల్లులపై పార్లమెంటులో చర్చలకు కాంగ్రెస్‌ పార్టీ సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.