- ప్రతిపక్షాలు సహకరించాలని ఖర్గేకు కేంద్రమంత్రి రిజిజు లేఖ
ఢిల్లీ, మహా : పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టే ముందు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గత అక్టోబర్ 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాసిన లేఖపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ప్రభుత్వం పదే పదే కోరినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చర్చలకు సమయం కేటాయించకపోవడంతో ఇతర రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపామని రిజిజు స్పష్టం చేశారు. బిల్లుపై విస్తృత ఏకాభిప్రాయం కోసం డీఎంకే , సమాజ్‌వాదీ పార్టీ , వైఎస్సార్ సీపీ , ఎన్సీపీ , శివసేన , ఏఐఎంఐఎం , బీజేడీ వంటి వివిధ పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే చర్చలు పూర్తి చేసిందని తెలిపారు. ఈ మేరకు కిరణ్ రిజిజు సోమమారం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చర్చలకు ప్రయత్నించిన నేపథ్యంలో మళ్లీ సంప్రదింపులు జరపాలని కాంగ్రెస్ పార్టీ పదేపదే డిమాండ్ చేయడంలో అర్థం ఏమిటని కిరణ్ రిజిజు ప్రశ్నించారు. ఇప్పటికే చేపట్టిన సంప్రదింపులను పరిగణనలోకి తీసుకోవాలని అదే డిమాండ్‌ను పునరావృతం చేయడం కంటే ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక సహకారం అందించాలని సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పార్లమెంట్ సమర్థంగా పనిచేసేలా అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాలపై చర్చల్లో అన్ని రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం విలువైనదిగా భావిస్తుందని తెలిపారు.
ప్రతిపక్షాలు సహకరించాలి
భవిష్యత్తులో ప్రవేశపెట్టే కీలక బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కిరణ్ రిజిజు ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమైన బిల్లుల ఆమోద ప్రక్రియకు కాంగ్రెస్ అడ్డంకులు సృష్టించకూడదని కోరారు. పార్లమెంటులో చర్చలు, సంప్రదింపుల ద్వారా విస్తృత ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. కాగా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి లోక్ సభ సీట్లను 50 శాతం మేర పెంచడంతో పాటు 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన బిల్లులను ఆమోదించుకోవడానికి ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సిద్ధమవుతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ కిరణ్ రిజిజు లేఖ హాట్ టాపిక్‌గా మారింది.







