- సుప్రీంకోర్టు ఆదేశించినా వారి తీరు మారలేదు
- వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు
- మాజీ సీఎం జగన్ ఆగ్రహం
విజయవాడ, మహా : స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రమైన అక్రమాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులను భౌతికంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసుల పాత్రపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన, వ్యవస్థలన్నీ పూర్తిగా వీధిపాలయ్యాయని మండిపడ్డారు.
సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా మార్పు లేదు
స్థానిక పోరులో జరుగుతున్న అక్రమాలపై తాము అన్ని ఆధారాలతో అధికారులను, రాజ్యాంగ వ్యవస్థలను ఆశ్రయించామని జగన్ స్పష్టం చేశారు. “స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న దారుణాలను, అక్రమాలను నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంచుతున్నాం. మేము సేకరించిన ప్రతి ఆధారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్, గౌరవ గవర్నర్ మరియు సుప్రీంకోర్టుకు సమర్పించాం,” అని ఆయన తెలిపారు. తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి తీవ్రంగా చీవాట్లు పెట్టిందని జగన్ గుర్తుచేశారు. “మా ఆధారాలను పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసింది. కానీ నామినేషన్లు వేయడానికి వస్తున్న అభ్యర్థులను భౌతికంగా అడ్డుకోవడం దేనికి సంకేతం…? రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా కూలిపోయాయి, దిగజారిపోయాయి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం కాదా…? కేవలం నామినేషన్లు వేయకుండా ఆపడానికేనా ఈ హైడ్రామాలు…..?” అని మాజీ సీఎం ప్రశ్నించారు.
అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసేలా వాతావరణాన్ని కల్పించాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికంగా సాగేలా చూడాలని అత్యున్నత నాయస్థానం ఆదేశించిందని జగన్ వివరించారు. “మేము అందించిన జాబితా ఆధారంగా అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పూర్తి సహకారం అందించాలని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించింది. అందరినీ నామినేషన్లు వేయనిస్తే, అందరం కలిసి ప్రజల వద్దకు వెళ్తాం, వారి ఆశీస్సులు కోరతాం. కానీ ఇలా నామినేషన్లను అడ్డుకోవడం అంటే ప్రజలు ఇచ్చిన ప్రజాస్వామ్య తీర్పును బుల్డోజ్ చేయడమే,” అని ఆయన ఆక్రోశం వ్యక్తం చేశారు.
కేవలం 4 చోట్లే అనుమతా….?
అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటి అమలులో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జగన్ మండిపడ్డారు. అభ్యర్థులను అడ్డుకున్న 19 మున్సిపాలిటీల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే నామినేషన్లను ఎందుకు స్వీకరించారని ఆయన నిలదీశారు. “సుప్రీంకోర్టు హెచ్చరించిన తర్వాత కూడా చంద్రబాబులో మార్పు వచ్చిందా? ఎస్ఈసీ మారిందా? డీజీపీ ప్రవర్తనలో మార్పు ఉందా? మీకు అత్యున్నత కోర్టు అంటే అసలు గౌరవం ఉందా? నామినేషన్లు అడ్డుకున్న 19 మున్సిపాలిటీలలో కేవలం నాలుగింటిలోనే ఎందుకు అంగీకరించారు? రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటిస్తోందా లేక చంద్రబాబు ఇచ్చే ఆదేశాలను అమలు చేస్తోందా?” అని ఆయన నేరుగా ప్రశ్నించారు.
ఎన్నికల వ్యవస్థను చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించిన జగన్ ఆయనను మహాభారతంలో శకుని పాత్రతో పోల్చారు. నిబంధనలను తనకు నచ్చినట్లు మారుస్తున్నారని విమర్శించారు. “మన ఎన్నికల వ్యవస్థలో చంద్రబాబు శకుని పాత్ర పోషిస్తున్నారు. తన సొంత ప్రయోజనాలకు అనుగుణంగా నిబంధనలను సవరిస్తున్నారు. నామినేషన్ల దశలోనే ఈ స్థాయిలో అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతుంటే రేపు పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో ఇంకెన్ని దారుణాలు చేస్తారో ఊహించుకోవచ్చు!” అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ పనితీరు ఆధారంగా ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని జగన్ సవాల్ విసిరారు. తమ హయాంలో చేసిన మంచి పనులను చూపే 86 శాతం విజయాలను సాధించామని గుర్తుచేశారు.
“చంద్రబాబు నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, తన పాలనా రికార్డును చూపించి ప్రజల ముందుకు వెళ్లాలి. మా పాలనలో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూపించే 86 శాతం స్థానిక సంస్థల విజయాన్ని సాధించాం. కానీ ఈరోజు ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, అందుకే కూటమి నాయకులు దిగజారి దొంగ దారుల్లో గెలవాలని చూస్తున్నారు. బీహార్ కంటే దారుణంగా రక్తం చిందించే కల్చర్‌ను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. పోలీసుల కళ్లముందే అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. అక్రమాలకు సహకరిస్తున్న పోలీసు అధికారులు, అధికారులను బాధ్యతల నుంచి తప్పించకుండా ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎలా జరుగుతాయి?” అని ఆయన ప్రశ్నించారు. గతంలో బూత్ రిగ్గింగ్‌లకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా నామినేషన్ సెంటర్లనే రిగ్గింగ్ చేసే స్థాయికి దిగజారారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎనిమిది రకాల కుట్రలతో రాష్ట్రాన్ని చితిలా మారుస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమనియయయయ న్యాయం జరిగే వరకు ప్రతి ఇంటి గుమ్మం తొక్కుతామని, ప్రతి కోర్టు తలుపు తడతామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.








