Mahaa Daily Exclusive

  కడప నగరంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి…

Share

  • కడప నగరంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి
  • కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి
  • జిల్లా కలెక్టర్‌కు వైఎస్సార్‌సీపీ నేతల వినతి

కడప, మహా : కడప నగరంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, నగరంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈరోజు కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బండి దీప్తి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఉమర్, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఈస్ట్ జోన్ మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నార్త్ జోన్ మండల అధ్యక్షులు బీహెచ్ ఇలియాస్, తదితరులు కలెక్టర్‌ను కలిసి ఎన్నికల నిర్వహణలో ఎదురైన సమస్యలను వివరించారు.

కడప నగరంలోని మొత్తం 361 పోలింగ్ బూత్‌లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నియమించిన పోలింగ్ ఏజెంట్లను అనుమతించలేదు. మరోవైపు, పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీ ఏజెంట్లకు ఎదురవుతున్న ఇబ్బందుల విషయంలో పోలీసులు తగిన చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

పోలింగ్ కేంద్రాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్లపై టిడిపికి చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడి, వారి ఏజెంట్ పాస్‌లను చించివేసి, భౌతికంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనల సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఏజెంట్లకే రక్షణ లేకపోతే సామాన్య ఓటర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర బలగాల పర్యవేక్షణలో కడప నగరంలో మళ్లీ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.