Mahaa Daily Exclusive

  సీఎం కుటుంబానికి అయ్యప్ప సొసైటీ కామధేనువా? 

Share

  •  రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా.. రౌడీ రాజ్యమా?
  •  తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైర్!

హైదరాబాద్, మహా.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అయ్యప్ప సొసైటీ భూములను ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ సంపాదనకు కామధేనువులా వాడుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నగరంలో మౌలిక సదుపాయాలను గాలికొదిలేసిన సీఎం.. కేవలం అక్రమ వసూళ్లపైనే దండయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె.. నెల రోజుల్లోగా అయ్యప్ప సొసైటీలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపకపోతే, తామే స్వయంగా రంగంలోకి దిగి అక్రమ భవనాలకు ‘రెడ్ మార్క్’ వేస్తామని ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

భూదాన్ ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ విద్యార్థుల కోసం అయ్యప్ప సొసైటీలో 150 ఎకరాలతో గురుకుల ట్రస్ట్ బోర్డు ఏర్పాటైందని, ఆ భూముల రక్షణకు ట్రస్ట్ చైర్మన్ విఠల్ రావు అలుపెరగని పోరాటం చేశారని కవిత గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని ఖానామెట్‌లోని అదే సొసైటీలో ఏకంగా 500 నుంచి 700 వరకు అక్రమ భవనాలు పుట్టగొడుగుల్లా వెలిశాయని మండిపడ్డారు. ప్రస్తుతం మరో 80 భవనాలు రాత్రికి రాత్రే లేస్తున్నాయని ఆరోపించారు. సర్వే నంబర్ 11/18 నుంచి 44 వరకు, అలాగే సర్వే నంబర్ 12లో విచ్చలవిడిగా నిబంధనలకు పాతరేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కేవలం నోటరీ కాగితాలతో 10 నుంచి 12 అంతస్తుల ఆకాశహర్మ్యాలకు పర్మిషన్లు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు.

ఈ అక్రమ నిర్మాణాల గుట్టు రట్టు చేసేందుకు గూగుల్ మ్యాప్ ఆధారాలతో వార్తలు కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపైనా ఇంటి యజమానులు దౌర్జన్యానికి దిగడం దారుణమన్నారు. ‘మా వెనుక ప్రభుత్వం ఉంది.. మా ఇష్టం’ అంటూ మీడియానే బెదిరించే స్థాయికి చేరారంటే.. రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక రౌడీ రాజ్యమా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సోదరులే స్వయంగా బ్రోకర్లుగా మారి ఈ అక్రమ అనుమతులు ఇప్పిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. మంథనిలో నిరుపేదల గుడిసెలను అర్ధరాత్రి పూట అమాంతం కూల్చేసిన ఈ ప్రభుత్వానికి, హైదరాబాద్ నడిబొడ్డున పదుల అంతస్తులు లేస్తున్నా ఎందుకు కనిపించడం లేదని నిలదీశారు. అయ్యప్ప సొసైటీ బాగోతంపై ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే ఉలుకూ పలుకూ లేదని, రాష్ట్రంలో ఆర్టీఐ వ్యవస్థ ఒక పెద్ద జోక్‌గా మారిందని ఎద్దేవా చేశారు. తక్షణమే ఖానామెట్‌లో సమగ్ర సర్వే చేసి, ఫైర్ సేఫ్టీ లేని, అనుమతులు లేని అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపైనా కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 320 మండలాలు కరువుతో అల్లాడుతుంటే.. కేంద్రం నుంచి నయాపైసా సాయం ప్రకటించకుండా కేవలం రాజకీయాలు మాట్లాడి వెళ్లడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి విదల్చని బీజేపీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామనడం కన్నా పెద్ద హాస్యం మరొకటి లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో గోదావరి, కృష్ణా జలాల లభ్యతపై ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రి తుమ్మల మరో మాట చెబుతూ రైతులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన కవిత, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహిళలు పెద్దఎత్తున భాగస్వాములై తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.