Mahaa Daily Exclusive

  ఢిల్లీలో పొల్యూషన్ అలెర్ట్.

Share

  •  కాలుష్య నియంత్రణకు హైటెక్ నిఘా.
  •  బండిపై ఏ కెమెరా కన్ను పడినా ఫైన్ పడాల్సిందే.

ఢిల్లీ, మహా.

ప్రతి శీతాకాలంలో ఢిల్లీ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసే వాయు కాలుష్యంపై ప్రభుత్వం సమరభేరి మోగించింది. కాలుష్య రక్కసిని కట్టడి చేసేందుకు ఈసారి కేవలం ఆంక్షలకే పరిమితం కాకుండా, టెక్నాలజీని బ్రహ్మాస్త్రంగా వాడుతోంది. రాజధాని రోడ్లపై తిరిగే ప్రతి వాహనంపై ఇప్పుడు హైటెక్ కెమెరాల నిఘా ఉండబోతోంది. ఇందుకోసం నగరం నలుమూలలా ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలను రంగంలోకి దించింది. ఇవి కేవలం నంబర్ ప్లేట్లను మాత్రమే కాకుండా, ఆ వాహనానికి కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం ఉందా లేదా, అది ఏ ఉద్గార ప్రమాణాలకు చెందినదన్న పూర్తి జాతకాన్ని సెకన్లలో స్కాన్ చేసి కమాండ్ కంట్రోల్ రూమ్‌కు చేరవేస్తాయి. ఒకవేళ ఏ వాహనానికైనా పీయూసీ లేదని తేలితే.. ఆ వాహనానికి నగరంలోని 500 పెట్రోల్ పంపుల్లో చుక్క ఇంధనం కూడా పోయకుండా కఠినమైన ‘నో పీయూసీ-నో ఫ్యూయల్’ విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నారు.

కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ సర్కార్ కేవలం కెమెరాలపైనే ఆధారపడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో అనుసంధానించిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే ఆటోమేటిక్‌గా ఈ కేంద్రానికి అలర్ట్ వెళ్తుంది, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరవేసి తక్షణ చర్యలు తీసుకునేలా ఈ హైటెక్ సిస్టమ్ పనిచేస్తుంది. రోడ్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేందుకు 334 ప్రత్యేక దళాలను కూడా రంగంలోకి దించారు. ఈ స్పెషల్ టీమ్స్ ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలను సీజ్ చేయడం, బహిరంగంగా చెత్త తగలబెట్టే వారిపై ఫైన్లు వేయడం, కెమెరాలు గుర్తించిన ఉల్లంఘనలను గ్రౌండ్ లెవల్‌లో చెక్ చేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తాయి. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టేందుకు కూడా పర్యవేక్షణ కేంద్రాల సంఖ్యను 47 నుంచి 60కి పెంచారు.

ఇక పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీలోకి వచ్చే వాహనాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు బీఎస్-4, అంతకంటే పాత వాహనాలను నగరంలోకి ఎట్టిపరిస్థితుల్లో అనుమతించరు. ట్రాఫిక్‌ను, కాలుష్యాన్ని తగ్గించే ఉద్దేశంతో నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు పార్కింగ్ ఫీజులను ఏకంగా డబుల్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో కేవలం 50 శాతం మంది మాత్రమే ఆఫీసుకు వచ్చేలా, మిగిలిన వారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఆఫీసుల వేళల్లోనూ మార్పులు చేశారు. రోడ్లపై దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు మెకానికల్ స్వీపింగ్ మెషిన్లతో నీటిని పిచికారీ చేస్తూ, డిసెంబర్ 10 నుంచి జనవరి 20 వరకు నిర్మాణ పనులపై పూర్తిస్థాయి నిషేధం విధించారు. ఇలా టెక్నాలజీని, పకడ్బందీ ఆంక్షలను మేళవించి కాలుష్య కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ఈ బహుముఖ పోరాటం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.