Mahaa Daily Exclusive

  భాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం.

Share

  •  కారులో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్!
  •  కుత్బుల్లాపూర్‌లో డీటీఎఫ్ అధికారుల మెరుపు దాడులు.
  •  భారీగా ఓజీ కుష్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం.
  •  నిందితుడు కుష్ లోయ కారు, సెల్ ఫోన్ల సీజ్

హైదరాబాద్, మహా.

మహానగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. యువతను మత్తులో ముంచేందుకు యత్నిస్తున్న ఓ డ్రగ్స్ పెడ్లర్ గుట్టును డీటీఎఫ్ (డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్) అధికారులు రట్టు చేశారు. నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో అత్యంత ఖరీదైన డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న డీటీఎఫ్ బృందం.. బుధవారం మెరుపు దాడులు నిర్వహించింది. ఓ కారులో అనుమానాస్పదంగా తిరుగుతూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని అడ్డగించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. నిందితుడిని కుష్ లోయగా అధికారులు గుర్తించారు.

పట్టుబడిన నిందితుడి వద్ద ముమ్మర తనిఖీలు చేపట్టగా భారీ ఎత్తున వివిధ రకాల మత్తు పదార్థాలు బయటపడ్డాయి. డీటీఎఫ్ బృందం నిందితుడి నుంచి 58 గ్రాముల ఓజీ కుష్, 0.95 గ్రాముల ఎండీఎంఏతో పాటు రెండు ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే, డ్రగ్స్ రవాణాకు వినియోగిస్తున్న కారును, కస్టమర్లతో మాట్లాడేందుకు వాడుతున్న సెల్‌ఫోన్లను సీజ్ చేశారు.

అనంతరం పట్టుబడిన మత్తు పదార్థాలు, కారు, మొబైల్ ఫోన్లతో పాటు నిందితుడు కుష్ లోయను తదుపరి విచారణ నిమిత్తం కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్‌కు డీటీఎఫ్ బృందం అప్పగించింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రధానంగా ఈ డ్రగ్స్‌ను నగరానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? వీటికి సూత్రధారులు ఎవరు? నగరంలో ఇంకెవరికైనా వీటిని విక్రయించాడా? అన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడి కాల్ డేటా ఆధారంగా ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌లోని మిగతా వారిని పట్టుకునేందుకు వల పన్నారు.