సంక్షేమానికి ఓటరు కార్డును ముడిపెడతారా?
* కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్!
* పేదవాడి పింఛనును ఓటరు కార్డుకు బానిసగా మార్చే కుట్ర.
* కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.
న్యూఢిల్లీ, మహా.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్‌కు బదులుగా ఓటరు గుర్తింపు కార్డును ప్రాతిపదికగా తీసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు వేయడం అనేది పౌరుడి ప్రాథమిక హక్కు అని, దానిని సంక్షేమ పథకాలకు ముడిపెడుతూ షరతులు విధించడం దారుణమని ఆయన మండిపడ్డారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని కొన్ని పథకాలకు ఓటరు గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేయాలంటూ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) చేసిన వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న రాహుల్ కేంద్రం తీరును తీవ్రంగా ఎండగట్టారు. పేదవాడికి అందే పింఛనును ఓటరు కార్డుకు బానిసగా మార్చలేరని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఇప్పటికే లక్షలాది మంది పేర్లను అక్రమంగా తొలగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని, అధికార పార్టీకి గిట్టని వారిని కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రేపు పొద్దున రేషన్, ఉపాధి హామీ, ఇళ్ల నిర్మాణాలు, ఉపకార వేతనాలకు కూడా ఇదే నిబంధన తీసుకొచ్చి పేదల కడుపు కొడతారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
మరోవైపు దేశ రాజధాని సహా పలు నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలపైనా కాంగ్రెస్ నేతలు మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం మొదలుపెట్టి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఫలితం శూన్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. కేవలం రోడ్లపై దుమ్ము దులపడమే కాలుష్య నియంత్రణ కాదని, భారీగా కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య నగరాల జాబితాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బరౌత్, ఖోరా, గజ్రౌలా తొలి స్థానాల్లో ఉన్నాయని, యూపీలో 13 నగరాలు, హర్యానాలో 11 నగరాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం రికార్డవుతోందని ఆయన గుర్తుచేశారు. నగరాల వారీగా కాకుండా భౌగోళిక ప్రాంతాల ప్రాతిపదికన సమగ్ర విధానం తీసుకురావాలని సూచించారు.
ఇక సామాన్యుల నడ్డివిరుస్తున్న ధరల పెరుగుదలపైనా కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ద్రవ్యోల్బణం దెబ్బకు పేద, మధ్యతరగతి జనం అప్పుల పాలవుతున్నారని జైరాం రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాబార్డ్ సర్వే లెక్కల ప్రకారం గ్రామీణ కుటుంబాల నెలవారీ ఆదాయంలో సగానికి పైగా (53.5 శాతం) కేవలం తిండి ఖర్చులకే సరిపోతోందని ఆయన స్పష్టం చేశారు. కూరగాయలు, పప్పులు, వంటనూనెలు, పాల ధరలు మండిపోతుండటంతో పొదుపు తగ్గిపోయి సామాన్యులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే దుస్థితి దాపురించిందన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల ఓటర్లు.. ఈ ధరల మంటపై, కాలుష్యంపై తమ ఓటుతో కేంద్రానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. పారదర్శకత ముసుగులో పేదలకు పథకాలు దూరం చేసే విధానాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని ప్రతిపక్ష నేతలు హెచ్చరించారు.







