న్యూఢిల్లీ, మహా : నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, ఒడిశా, సిక్కిం, చండీగఢ్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూలలో ఎస్ఎస్ఆర్ను చేపడుతున్నట్టు తెలిపింది. అర్హులైన ఓటర్లను ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్లను నమోదు చేయడమే ఈ ఓటర్ల జాబితా సవరణ ముఖ్య ఉద్దేశం. 2027 జనవరి 1వ తేదీ నాటికి అర్హులైన వారిని ఈ ప్రక్రియలో నమోదు చేయడమే కాకుండా 2027 ఏప్రిల్ 1, జులై 1, అక్టోబరు 1నాటికి ఎవరైతే అర్హులవుతారో వారు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాలను ఈ నెల 30న ప్రచురిస్తారు. వచ్చే ఏడాది జనవరి 21న తుది ఓటర్ల జాబితాలను ప్రచురిస్తారు. ఈ ప్రక్రియను చేపట్టడానికి అవసరమైన సిబ్బందిని, ఇతర వనరులను సమకూర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ‘సర్’లో మాదిరిగా కాకుండా, ఎస్ఎస్ఆర్ ద్వారా తమ పేర్లు నమోదు చేయించుకునేటపుడు దరఖాస్తుదారులు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి పత్రాలను అందజేయనవసరం లేదు. లేదా గత ఓటర్ల జాబితాలతో మ్యాపింగ్ కానక్కర్లేదు. ఈ ఎస్ఎస్ఆర్ ప్రక్రియ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బిఎల్ఒ) ఇంటింటికీ తిరగనక్కరలేదు. దానికి బదులుగా ముసాయిదా, తుది జాబితాలను పోలింగ్ బూత్ల వద్ద ఉంచుతారు.







